AP CM Chandra Babu Participated In drone Summit 2024 in Amaravati:  అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే సమ్మిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి వెలిగించి స్టార్ట్ చేశారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు, రామ్మోహన్ నాయుడికి ఘనంగా ఆహ్వానం పలికారు అధికారులు. డ్రోన్‌తో ఈ సమ్మిట్‌కు చెందిన బ్రోచర్‌ను ప్రదర్శించారు. అనంతరం సభ ప్రాంగణంలో ముగ్గురు లీడర్లు కలిసి ఫొటోలు దిగారు. అవి క్షణాల్లోనే వారికి అందజేశారు.  


సమ్మిట్ ప్రారంభమైన తర్వాత ప్రారంభోపాన్యాసం చేసిన సీఎం చంద్రబాబు డ్రోన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఫ్యూచర్ గేమ్‌ ఛేంజర్స్ అంటూ కామెంట్ చేశారు. 1995లో తాను ఐటీ గురించి ఆలోచిస్తే ఎవరూ నమ్మలేదని ఇప్పుడు డిజిటల్ యుగంలో జీవిస్తున్నామని గుర్తు చేశారు. అదే మాదిరిగా భవిష్యత్‌లో టెక్నాలిజీని డ్రోన్స్‌ మరో స్థాయికి తీసుకెళ్తాయని జోస్యం చెప్పారు చంద్రబాబు. ఆ మార్పును అందిపుచ్చుకునే ఉద్దేశంతో డ్రోన్స్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 


అభివృద్ధిలో డ్రోన్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయని గ్రహించినందునే డ్రోన్ సమ్మిట్ పెట్టి మార్పులను చర్చిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేయలేదని తొలిసారి ఏపీ ముందడుగు వేసిందని అన్నారు. 1995 నుంచి ఐటీ డెలవప్‌మెంట్‌కు ఎలాంటి చర్యలు తీసుకున్నామో ఇప్పుడు అంతకంటే మెరుగైన ప్రణాళికతో డ్రోన్స్‌ ద్వారా సంపద పెంచబోతున్నామని తెలిపారు. 


ఐటీ డెలవప్‌మెంట్‌తో ఎలా హైదారాబాద్‌ ప్రపంచ నగరాల సరసన చేరిందో... రేపటి భవిష్యత్‌లో అమరావతి కూడా అభివృద్ధి సిటీగా మారబోతోందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. ఏపీని డ్రోన్స్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. విజయవాడ వరదల టైంలో డ్రోన్స్ పని తీరు ప్రజలు కూడా గమనించారని వివరించారు. రెస్క్యూటీం వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్స్ వెళ్లి ఆహారం, నీళ్లు, మందులు అందిచాయని పేర్కొన్నారు.