Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ వేధింపులు తట్టుకొని ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ పార్టీకి అండగా ఉన్న వాళ్లకే ఈసారి నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని స్పష్టం చేశారు. దీని కోసం ప్రత్యేక విధానం ద్వారా క్షేత్రస్థాయి రిపోర్టు తెప్పించుకుంటున్నానని తెలిపారు. వివరాలు వచ్చిన తర్వాత మరోసారి వడపోసి ఇంకా మిస్ అయిన వాళ్లు ఉంటే వారికి న్యాయం చేసేలా ఈ భర్తీ ప్రక్రియ ఉంటుందని అన్నారు. 


టీడీపీ ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీలోని ఇతర ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌  నిర్వహించిన చంద్రబాబు కీలక అంశాలు ప్రస్తావించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారంతో విర్రవీగి టీడీపీ నేతలను హింసించిన ఇబ్బంది పెట్టిన వారికి ఎంట్రీ లేదన్నారు చంద్రబాబు. అలాంటి వాటిని పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ప్రతి శనివారం పార్టీ నాయకుల సమస్యలను తానే స్వయంగా వింటానని వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటానని వెల్లడించారు. 


ఐదేళ్ల పాటు పోరాటం ఒక ఎత్తు అయితే పొత్తులో భాగంగా సీట్లు లేకపోయినా కూటమిక కోసం చాలా మంది నేతలు శ్రమించారని వారిని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. అలాంటి వారి వల్లే ఇంతటి ఘన విజయం సాధించగలిగామని గెలిచిన వారంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గ్రామస్థాయి శ్రేణులంతా పార్టీ ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా అప్పటి వేధింపులను ఎదుర్కొని విజయవంతం చేశారని కితాబు ఇచ్చారు. 


అలాంటి పోరాటాలు చేసిన వారికి ఈసారి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు చంద్రబాబు. వివిధ మార్గాల్లో పార్టీ విజయానికి నిజాయితీగా కష్టపడే వాళ్ల వివరాలు తెలుసుకుంటున్నట్టు తెలిపారు. పార్టీ నేతలు చెప్పిన వివరాలు తీసుకోవడంతోపాటు వేరే మార్గాల్లో కూడా కింది స్థాయి నేతల శ్రమను బేరీజు వేసి నిజంగా కష్టపడేవాళ్లకు పదవులు వచ్చేలా చూస్తామన్నారు చంద్రబాబు. 


పని చేసేవాళ్లకే పదవులు అనే విధంగా ఇకపై నిర్ణయాలు ఉంటాయన్నారు చంద్రబాబు. ఇప్పటి నుంచి 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని... వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని శ్రేణులకు సూచించారు. ఇచ్చిన హామీల్లో ప్రధానమైన ఐదింటిని మొదటి విడతలోనే ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. 


గత ప్రభుత్వం టీడీపీ శ్రేణులనే కాకుండా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టిందన్నారు. పింఛన్లు నేరుగా ఇంటికి ఇవ్వకుండా హింసించిందని వలంటీర్లు లేరన్న కారణంతో బ్యాంకుల చుట్టూ తిప్పిందని విమర్శించారు చంద్రబాబు. సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇవ్వడం ఆసాధ్యం కాదు సాధ్యమని చెప్పడానికే తామవారితో ఈసారి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. 


అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే బీసీలకు ఉన్నతమైన పదవుల్లో ఉంచినట్టు గుర్తు చేశారు. బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు టీడీపీ అధ్యక్ష పదవి అప్పగించామని, మరో బీసీ అయిన అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవిలో కూర్చోబెట్టామన్నారు చంద్రబాబు భవిష్యత్‌లో కూడా ఇలాంటి చాలా ఉంటాయని ఆ దిశగానే కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు.