నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసగించనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటి సారి. 


గవర్నర్ నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడి... బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలనేదానిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశ పెట్టాలో కూడా తేల్చనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాలను మార్చి14 నుంచి మార్చి 24 వరకు నిర్వహించాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 


17న బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న బుగ్గన


ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం 17వ తేదీన బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న వేళ ఇప్పుడు ప్రవేశ పెట్టే బడ్జెట్టే ఈ ప్రభుత్వానికి ఆఖరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కానుంది. అందుకే ఈ ఏడాది 2లక్షల 60వేల కోట్లతో బడ్జెట్‌ను రూపకల్పన చేయబోతున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 


భారీ అంచనాలతో ఆఖరి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కీలక రంగాలపై మెయిన్‌గా ఫోకస్ చేయనుంది. సంక్షేమంతోపాటు వ్యవసాయం, విద్యా,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం. ఎన్నికల ముందు  ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో ప్రతి అంశాన్ని కీలకంగా సునిశితంగా పరిశీలిస్తున్నారు. బడ్జెట్‌ మొత్తం ఒక ఎత్తైతే.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ కీలక ఇష్యూస్‌పై ప్రకటన చేయబోతున్నారట. నాలుగేళ్ళ పాలన, మూడు రాజధానులు, సంక్షేమం,  వైజాగ్ గ్లోబల్ సమిట్ ఇలా ఒక్కో అంశంపై మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. 


రాజధాని అంశమే కీలకం


విశాఖ కేంద్రంగా రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే క్లారిటి ఇచ్చారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మాట్లాడిన సీఎం జగన్ విశాఖపట్టణం కేంద్రంగా రాజధాని అని అక్కడికే తాను కూడా షిప్టు అవుతన్నట్టు తేల్చేశారు. కోర్టులో కేసులు నడుస్తున్న టైంలో ఎప్పుడు విశాఖ వెళ్తారనే విషయంలో చాలా ఊహాగానాలు నడుసస్తున్నాయి. సీఎం విశాఖకు షిఫ్టింగ్‌పై కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే క్లారిటి ఉంటుందని అంటున్నారు. 


తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత సీఎం వారానికి మూడు రోజులు వైజాగ్‌లో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే సీఎం సింగల్‌గా వైజాగ్ వెళితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే అంశంతోపాటు, మిగిలిన  శాఖల  షిఫ్టింగ్‌ విషయం కూడా సభలో ప్రస్తావనకు రానుంది. మరోవైపు రాజధాని అంశం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దీంతో సుప్రీం నిర్ణయం కూడా కీలకంకానుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..


సిద్దం అవుతున్న ప్రతిపక్షం....


బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ కూడా కీలక అంశాలకు సంబంధించిన చర్చ లెవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన ధరలు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇతర అంశాల పై టీడీపీ చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వాడి వేడిగానే ఈసారి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయని భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు, ఎమ్మెల్సీ హోదాలో నారా లోకేష్ ఇద్దరూ సభకు దూరంగా ఉండబోతున్నారు. గతంలో అసెంబ్లి వేదికగా సవాల్ చేసిన చంద్రబాబు,సమావేశాలకు దూరంగా ఉంటుండగా,ఎమ్మెల్సీ గడువు ముగియటంతో నారా లోకేష్ కూడ ఈసారి మండలి సమావేశాలకు రావటం లేదు. మరోవైపున లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రలో బిజిగా ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఈసారి బడ్జెట్ సమావేశాల్లో తమ వాదనను పూర్తిగా వినిపించేందుకు అన్ని శక్తులను సమీకరిస్తున్నారు.