Ambati Rambabu comments on Amaravati: పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరి చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తెలీదని ఎద్దేవా చేశారు.. వచ్చే ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య మాత్రమేనని.. పవన్, లోకేష్, బీజేపీ వంటివారెవరు వచ్చినా ఉపయోగం లేదని అన్నారు. ఎవరు ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా మళ్లీ ప్రభుత్వం స్థాపించేది తామేనని దీమా వ్యక్తం చేశారు.


ఏపీ రాజధాని ఇప్పటికీ అమరావతే - అంబటి రాంబాబు
ఏపీ మూడు రాజధానుల అంశంపై కూడా అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ రాజ‌ధాని లేని రాష్ట్రం అంటూ టీడీపీ, జనసేన నేతలు తరచూ ఎగతాళి చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఆ ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు. అమ‌రావ‌తిని తాము ఎక్కడికీ త‌ర‌లించ‌లేద‌ని అక్కడే ఉందని అన్నారు. ఆ ప్రాంతం ఏపీ రాజ‌దానిగా ఇప్ప‌టికీ కొన‌సాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు.


‘‘మా పరిపాలనే మా నమ్మకం, మా ప్రభుత్వం, పార్టీ బలం.. లంచాలు, వివక్షలు లేకుండా పేదలకు రూ.2.60 లక్షల కోట్లు అందించాం. మేము ధైర్యంగా ప్రజలల్లోకి వెళ్లి వారికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతాం. మళ్లీ వచ్చేది, గెలిచేది జగనన్నే.. అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉందో ప్రజలకు కూడా తెలియదు’’ అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.


అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థానం నుంచి వైసీపీ ఇంకా ఇంఛార్జిని ప్రకటించలేదు. అటు టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. మరోవైపు, నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేయబోతుండడం ఖరారు అయింది. అనిల్ కుమార్ ఈ నెల 14వ తేదీన భారీ ర్యాలీతో నరసరావుపేట చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో ఇప్పుడు పల్నాడు రాజకీయం ఆసక్తి కరంగా మారింది.