Amaravati Tensions News: అమరావతిలో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాకు సంబంధించిన అవినీతిపై ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చేసుకున్న పరస్ఫర ఛాలెంజ్‌లు చేసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని ఇరువురూ ఒకరికొకరు కవ్వించుకున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం నుంచి తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. వారు అనుకున్నట్లుగానే ఇద్దరు నేతలు తమ అనుచరులతో అమరావతికి వచ్చారు. అమరలింగేశ్వర ఆలయానికి ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు వచ్చారు.


టీడీపీ నేతల సవాలును తాను స్వీకరించానని నంబూరు శంకర్ రావు ప్రకటించారు. ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. టీడీపీ నేతల అవినీతిని స్వామివారి గుడి వద్ద నిరూపిస్తానని తెలిపారు. తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఆధారాలతో వివరిస్తానని అన్నారు. టీడీపీ శ్రేణులు భారీగా అమరావతికి వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అమరావతికి తరలి రావాలని పిలుపునిచ్చారు.


నిలువరించిన పోలీసులు
టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కార్యకర్తలను వెంట వేసుకొని క్రోసూరు రోడ్డు నుంచి పెద్ద ఎత్తున తరలిరాగా.. ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు క్రోసూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇరు వర్గీయులు ఎదురుపడకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఉద్రిక్తతలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి.


పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు మాట్లాడుతూ.. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు జరగడంలేదని అన్నారు. పెదకూరపాడులో గతంలో జరిగిన అవినీతి, ఇప్పుడు అవినీతిపై చర్చకు తాను సిద్ధమని, సవాలు ప్రకారం ఆలయానికి వచ్చానని అన్నారు. గతంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా నిరుపిస్తామన్నారు. తాను ఒక్కడినే వచ్చానని, టీడీపీ నుంచి కూడా కొమ్మాలపాటి శ్రీధర్ ఒక్కరే రావాలని అన్నారు. 


సవాల్‌ను స్వీకరిస్తున్నాం - కోమ్మాలపాటి
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలపై తాము ప్రశ్నించామని, నిబంధనలను పాటించడం లేదని చెప్పామన్నారు. కానీ ఎమ్మెల్యే తాను ఓ నీతిమంతుడినని, చర్చకు రావాలని సవాల్ విసిరారని అన్నారు. ఆ సవాల్‌ను తాము స్వీకరించామన్నారు. ఏ గ్రామంలో అయినా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప వైఎస్ఆర్ సీపీ ఏమీ చేయలేదని ఆరోపించారు. దీనిపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్ సీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారని శ్రీధర్ మండిపడ్డారు. పోలీసు బలగాలతో మమ్మల్ని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో తప్ప వైఎస్ఆర్ సీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి లేదని కొమ్మాలపాటి అన్నారు.


ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య మొదలైన మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అదే నేటి ఈ పరిస్థితికి దారి తీసింది.