అమరావతిలో రోడ్ల నిర్మాణం వల్ల స్థలాలు కోల్పోతున్న రైతులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో గుండెపోటుతో మరణించిన మందడం గ్రామ రైతు దొండపాటి రాములు అలియాస్ రామారావు కు నివాళి అర్పించడానికి వచ్చిన నేతలకు చేదు అనుభవం ఎదురైంది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లఫై రాములు కుటుంబ సభ్యులు, అమరావతి రైతులు " ఇంకెంత మందిని చంపుతారు అంటూ " ఆగ్రహం ప్రదర్శించారు. దానితో అక్కడికి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యే కు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పై అమరావతి రైతుల్లో చాలామంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చివరకు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రాములు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారిని శాంతింప చేయాల్సి వచ్చింది.
ఇంతకూ రాములు ఎలా చనిపోయాడు?
అమరావతి రైతులు ఆల్రెడీ ఇచ్చిన భూముల్లో రాజధాని పనులు జరుగుతున్నాయి. అవి కాకుండా మందడం గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం మరి కొన్ని ఇళ్ళను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం రైతులతో మందడం గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన రాములు ఇల్లు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదు కానీ తనలా ఇల్లు కోల్పోయే వాళ్ళందరికీ కాస్త మంచి చోట తాళ్ళాయ పాలెం దగ్గర్లో అన్ని సదుపాయాలతో సదుపాయాలతో నివాసం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై చర్చ జరుగుతుండగానే కూర్చున్న కుర్చీలోంచి కింద పడిపోయిన రాముల్ని (68) మణిపాల్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గమద్యం లోనే ఆయన మృతి చెందారు. మందడం లోని వేణుగోపాల స్వామి గుడి దగ్గర రాములు నివాసం ఉంది
పరామర్శకు వచ్చిన మంత్రులకు చుక్కెదురు
రాములు మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించడం కోసం ఆయన నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు రాములు కుటుంబ సభ్యులు, అమరావతి రైతుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. " ఇంకా ఎంతమందిని చంపడానికి వస్తున్నారు అంటూ " కొందరు తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజధాని కోసం విలువైన భూములు, ఇళ్లను రైతులకు త్యాగం చేసిన రైతులకు బురదలో ఇల్లు ఇచ్చారని ఇప్పటికీ ఇస్తామన్న రిటర్నబుల్ ప్లాట్లను ఇవ్వకుండానే మభ్య పెడుతున్నారంటూ ఆరోపించారు. పైగా ఇప్పుడు రోడ్లు వెడల్పు కోసం అంటూ మందడం గ్రామంలో ఇళ్లను అడుగుతున్నారంటూ ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక రాములు లాంటి వాళ్ళు మృతి చెందుతున్నారు అంటూ వారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానితో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కాసేపు సైలెంట్ అయ్యి తర్వాత వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాల న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన మంత్రి నారాయణ కు కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. "మీ సానుభూతి మాకు అక్కర్లేదు అంటూ " రాములు కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు నెరవేరుస్తామన్న హామీల విషయం లో తీవ్రంగా జరుగుతున్న జాప్యానికి రాములు మృతి తోడవడం తో అమరావతి రైతుల కోపం తీవ్ర స్థాయికి చేరుకుంది.
అసలు కోపం ఎమ్మెల్యే పైనే..
మందడం లో ఏర్పాటు చేసిన సభలో రామారావు (రాములు) మంత్రి నారాయణ సిఆర్డియే అధికారులతో తన బాధ చెప్పుకుంటూ అమరావతి కోసం రెండు ఎకరాలు ఇచ్చిన తనకు వాగు మధ్యలో స్థలం ఇచ్చారని అక్కడికి వెళ్లి తానేలా నివాసం ఉండాలంటూ సమస్య చెప్పుకునే ప్రయత్నం చేశారు. తమకు మెరుగైన చోట నివాసం కల్పించక పోతే ఆత్మహత్యే గతి అంటూ చెబుతుండగానే స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రామారావు (రాములు) కి అడ్డు తగిలారు.
నిరాశగా స్టేజ్ దగ్గర నుండి వెను తిరిగిన రామారావు కుర్చీలో కూర్చోగానే కుప్పకూలిపోయారు. ఆయనకు ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి తరలించగా దారిలోనే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సంఘటన అమరావతి రైతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ఎమ్మెల్యే నుంచి తమకు సరైన సహకారం లభించడం లేదని రైతు సంఘాల నాయకుల్లోనూ కొందరు అమరావతిలో అన్యాయం చేస్తున్నారంటూ ఒక సెక్షన్ రైతుల నుంచి ఆరోపణలు వెలువడుతున్నాయి.
స్వయంగా ఫోన్ చేసి రామారావు కుటుంబంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
ఇక రైతుల్లో పెల్లుబుకుతున్న అగ్రహాన్ని గమనించిన సీఎం చంద్రబాబు స్వయంగా రామారావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఫోన్లో వారిని పరామర్శించిన ముక్యమంత్రి రామారావు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతూనే వారికి ఎలాంటి లోటు రాకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లను ఆదేశించారు.