వైకాపా రప్పా రప్పా రాజకీయం పరిధులు దాటుతోంది. హింసను ప్రేరేపించే విధంగా రప్పా.. రప్పా బ్యానర్లు ప్రదర్శిస్తున్న వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత జగన్ పుట్టిన రోజు సందర్భంగా మరింత అతి చేశారు. చాలా చోట్ల జంతుబలులతో జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకాలు చేయడంతోపాటు.. అధికారంలోకి వచ్చిన వంటనే రప్పా రప్పా అంటూ.. ఫ్లెక్సీలు వేశారు. వీటిపై ఫిర్యాదులతో కొంతమందిని అదుపులోకి తీసుకుంటుంటే.. దానిని కూడా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.

Continues below advertisement

గోపాలపురంలో మళ్లీ జంతుబలి

ఆరు రోజుల కిందట జగన్‌మోహనరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గంలో వివాదాస్పద ప్లెక్సీలు వేశారు. ద్వారకాతిరుమల రామసింగవరంలో వివాదస్పద ఫ్లెక్సీలు వేశారు. “2029లో మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే రప్పా రప్పా నరుకుతాం” అంటూ వేసిన పోస్టర్ కలకలం రేపింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటివి వేశారు. అయితే ఈ ఫ్లెక్సీని ప్రింట్ చేసిన  ప్రింటర్‌ను క్లోజ్ చేసిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు.  గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ ఘటనను ఖండిస్తూ శుక్రవారం మాట్లాడారు. దానికి కౌంటర్‌గా అన్నట్లు వైకాపా శ్రేణులు మరింత రెచ్చిపోయాయి. ఓ వైపు పోలీసులు కేసు పెట్టినా కూడా ఆగలేదు.   మరింత రెచ్చిపోయి.. అదే నియోజకవర్గంలోని నల్లజెర్ల మండలం చోడవరంలో మేకపోతును నరికి... అరాచకం చేశారు. జంతుబలి చేస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

Continues below advertisement

పోలీసులు షాక్ ట్రీట్‌మెంట్

నల్లజెర్ల మండలంలో జరిగిన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీనితో సంబంధం ఉన్న.. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌ నుంచి  కోర్టు వరకూ రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితి చూస్తే.. అందరికీ గట్టిగానే కోటింగ్ పడినట్లుగా అనిపిస్తోంది. ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తీవ్రంగా స్పందించారు. ఫ్లెక్సీల ముందు జంతువులను బలి ఇచ్చి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ ఉత్సాహంతో ఇలాంటి పనులు చేసి యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన హితవు పలికారు

వైకాపా ఉన్మాదం- హోంమంత్రి అనిత

“రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు ఎంతకైనా దిగజారిపోతున్నారు - జంతుబలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారు”  అంటూ వైసీపీ శ్రేణులపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. - తమ పార్టీ నేతలు ఏం చేసినా ఆ పార్టీ నాయకుడు నోరు తెరిచి తప్పని చెప్పడం లేదని.. టీనేజ్ పిల్లలను సైతం సైకోలు, ఉన్మాదులుగా తయారు చేస్తున్నారుని మండిపడ్డారు. “ఇలాంటి వాటిని ఖండించలేదంటే జగన్ అసలు మనిషేనా ?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చాలా చోట్ల అరాచకాలు..

వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా చాలా చోట్ల వైకాపా శ్రేణులు అలజడి సృష్టించాయి. బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్ల ప్రదర్శిస్తూ జంతు బలి చేసి జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకం చేశారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులతో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. బాణసంచా శబ్ధాలతో తనకు ఇబ్బందిగా ఉందని చెప్పిన సంధ్యారాణి అనే గర్భిణిని కాలితో సత్యసాయి జిల్లాలో అజయ్‌ దేవా అనే వ్యక్తి కాలితో తన్నాడు. అతను వైసీపీ అని ప్రభుత్వం.. జనసేన అని వైసీపీ అంటున్నాయి. అతను ఎవరైనా కానీ.. జగన్ బర్త్‌డే వేడుకల్లోనే ఈ గొడవ జరిగింది. కల్యాణదుర్గం, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో గొర్రెల తలలను నరికి, రక్తంతో జగన్ ఫ్లెక్సీకి వైసీపీ కార్యకర్తలు అభిషేకం చేశారు. ఈ ఘటనలకు పాల్పడ్డ వారిని చాలా చోట్ల అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసులు నమోదవుతున్నా కూడా నిన్న రాత్రి గోపాలపురంలో మళ్లీ అదే పని చేశారు.