Amaravati Farmers: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక కమిటీగా ఏర్పడి ఈ మధ్యనే గుంటూరులో ఒక సమావేశం నిర్వహించారు. వారి మాటల్లో రాజధాని కోసం భూములు ఇచ్చి అధికారులతో మాటలు పడాల్సిన కర్మ పట్టిందే అన్న బాధ ఎక్కువగా కనిపించింది. చంద్రబాబుపై నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు భూములు ఇస్తే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం నత్త నడకన పనిచేస్తోంది అనేది వారి ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సిఆర్డిఏ అధికారులు కలవడానికి నానా అగుచాట్లు పడవలసి వస్తుందని అధికారులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. నిజానికి 2019-24 మధ్య కాలంలో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వంపై మొట్టమొదట ఉద్యమాలు చేసింది తామే అని దాని ఫలితంగా 2024 ఎన్నికల్లో కూటమి పెద్ద విజయం సాధించింది అనీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అమరావతి రైతులు వినిపిస్తున్న ప్రధాన సమస్యలు ఇవి 

Continues below advertisement

1) గ్రామ కంఠం సమస్య-గెజిట్ నోటిఫికేషన్ ఆలస్యం

ప్రధానంగా అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్య అసలు రాజధాని బౌండరీస్ ఎక్కడని. ఇంతవరకు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో రాజధాని ఎల్లలపై సందిగ్దత అలాగే కొనసాగుతుంది. అదిగాక గ్రామ కంఠాల సమస్య అలాగే నిలిచిపోయింది. నిజానికి ప్రభుత్వం, అధికారులు దృష్టి పెడితే పది పదిహేను రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ కూటమి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికి సమస్య అలాగే ఉంది.

2) మహిళల్ని, చిన్న రైతులని అవమానిస్తున్నారు

CRDA అధికారులు మహిళలు, చిన్నకారు రైతులతో మాట్లాడే విధానం అసలు బాలేదని రాజధాని కోసం భూములు ఇచ్చి ఉద్యమాలు చేసిన తమతో వారి వ్యవహార శైలి ఏమాత్రం బాగుండడం లేదనేది వారి ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు వ్యతిరేకత లేదని కానీ కింద ఉన్న నాయకులు అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.

Continues below advertisement

3) భూములు ఇవ్వని పొలాల్లో ఇచ్చిన వారికి ప్లాట్లు

అమరావతికి 29 గ్రామాల ప్రజలు భూములు ఇవ్వగా ఆయా గ్రామాల్లో ఇంకా కొన్ని పొలాల భూ సమీకరణ జరగాల్సి ఉంది. భూములు ఇచ్చిన రైతులకు ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే విషయంలో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా భూములు ఇవ్వని 1250 ఎకరాల్లో రోడ్లు వేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దానితో అక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా గజిబిజిగా తయారైంది.

4) ఇప్పటికీ అమరావతి రైతులపై కేసులు అలానే ఉన్నాయి  అలానే ఉన్నాయి

2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల JAC నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి. వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ అలాగే ఉండిపోయింది.

మొత్తం 14 సమస్యలు... తీర్చింది ఒక్కటే

ప్రభుత్వం వచ్చిన కొత్తలో మున్సిపల్ మంత్రి నారాయణ కలిసి అమరావతి జేఏసీ 14 సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. అయితే వాటిలో నెరవేరింది మాత్రం కేవలం ఒక్కటే. అది రైతులు ఇచ్చిన భూములకు ఏడాది పొడవునా ఇచ్చే కౌలు. అలాగే అమరావతిలో ఉన్న అసైండ్  భూములకు సంబంధించి ఇచ్చే నష్ట పరిహారంపై ఇప్పట్లో ఏమి తేల్చలేదని స్పష్టత రైతులకు ఇచ్చేసింది ప్రభుత్వం. మిగిలిన 12 సమస్యలపై ప్రభుత్వం గానీ సిఆర్డిఏ అధికారులు కానీ ఏమి తేల్చకుండా ఉండడం వల్ల రైతుల నుంచి జేఏసీ నాయకులు పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఈ నెలాఖరున మరోసారి సమావేశమై తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అమరావతి రైతుల JAC చెబుతోంది.

ఈరోజు రైతు సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం

మరోవైపు రైతుల ఆందోళన ఫై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈరోజు అమరావతి రైతుల సమస్యలపై చర్చించడానికి మంత్రుల బృందం భేటీ కానుంది. ఇప్పటికే అంటే ఈ నెల 10వ తేదీన జరిగిన కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన అంశాల పురోగతితోపాటు రైతులు లేవనెత్తుతున్న ఇతర సమస్యలపై చర్చిస్తారని మంత్రి నారాయణ కార్యాలయం ప్రకటించింది. 

సీఎం చంద్రబాబు నియమించిన ఈ కమిటీ రెండో సమావేశం నేటి ఉదయం 9 గంటలకు రాయపూడిలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫీస్ 7వ ఫ్లోర్‌లో జరుగుతుంది. కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రి నారాయణ,తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ,సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ,అదనపు కమిషనర్ భార్గవ తేజ ఈ సమావేశంలో పాల్గొంటారు. మరి ఈ సమావేశంలోనైనా అమరావతి రైతులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చి వారిని శాంత పరుస్తారో లేదో చూడాలి.