YS Jagan : అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన ఈ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో దాదాపు అరగంటపాటు గడిపారు. 11.40గంటలకు కోర్టుకు వచ్చిన జగన్ 12.15గంటలకు బయటకు వెళ్లిపోయారు.
జగన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడ్నుంచి నాంపల్లి కోర్టుకు పదకొండున్నరకు చేరుకున్నారు. పన్నెండున్నర వరకు కోర్టులో ఉన్నారు. అక్కడ విచారణ పూర్తి అయిన తర్వాత జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు.
చాలా కాలంగా జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్‌లో ఉండటం లేదు. చాలా ఏళ్ల తర్వాత లోటస్ పాండ్‌కు వచ్చిన జగన్ అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి కొందరు నేతలను కలిసి మళ్లీ బేగంపేటకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు. జగన్ మీదున్న సీబీఐ, ఈడీ కేసులు 2012లో విచారణ ప్రారంభమయ్యాయి. అక్రమ ఆస్తులు, క్విడ్ ప్రో కో ద్వారా ఆస్తులు కూటబెట్టారని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యాపారా సామ్రాజాన్ని నిర్మించుకున్నారు సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు కోర్టులో 11 ఛార్జిషీట్‌లు దాఖలు అయ్యా. వాటిపై విచారణ సాగుతోంది. ఆయన ఈ కేసుల విచారణకు 2020జనవరి 10 హాజరయ్యారు. తర్వాత తాను ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరైతే ప్రజా ధనం వృథా అవుతుందని చెప్పి మినహాయింపు పొందారు.
ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు వీక్లీ పిటిషన్లు వేసి అనుమతి తీసుకున్న జగన్, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా 'బిజీ'గా ఉన్నారని వాదనలు చేస్తూ వచ్చారు. అయితే ఈ నెల 11న యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి గట్టిగానే చెప్పారు. అయినా సరే ఆయన కోర్టుకు రాకుండా వీడియో కాన్ఫరెన్స ద్వారా హాజరవుతానని చెప్పుకొచ్చారు. దీన్ని కోర్టు అంగీకరించలేదు. కచ్చితంగా కోర్టు రావాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది.
ప్లేస్ ఏదైనా అదే రప్పా రప్పా
అక్రమాస్తుల కేసులో కోర్టుకు జగన్ హాజరైన వేళ వైసీపీ శ్రేణులు కోర్టు ప్రాంగణంలో హడావుడి చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. 2029లో 88 సీట్ల మేజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే అంటూ హెచ్చరించారు. రప్పా రప్పా ఉంటుందని వార్నింగ్ ఇచ్చే ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ మోహన్ రెడ్డి బేగంపేటలో విమానం దిగినప్పటి నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లే వరకు హంగామా చేశారు. జగన్ మోహన్ రెడ్డి కూడా తన కారు నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేశారు.
రోడ్లుపై వైసీపీ శ్రేణుల హడావిడితో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బేగంపేట పరిసరాల్లో వాహనాలు నిలిచిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.