AB Venkateswara Rao Letter to Election Commission: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. కేంద్ర పరిపాలన ట్రెబ్యునల్ (క్యాట్) తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తనకు పోస్టింగ్ ఇవ్వడం లేదంటూ ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. క్యాట్ తీర్పును అనుసరించి పోస్టింగ్ ఇప్పించాల్సిందిగా వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్ ను కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిఘా విభాగానికి సంబంధించిన పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ పై గడిచిన ఐదేళ్లుగా ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట క్యాట్ ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో మరోసారి ఆయన ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఈ నెల 31న పదవి విరమణ చేయనున్న తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, తక్షణమే తనకు న్యాయం చేయాలని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన తన సస్పెన్షన్ చెల్లదంటూ పది రోజుల కిందట క్యాట్ తీర్పు ఇచ్చిందని ఏబీ వెంకటేశ్వరరావు ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖతోపాటు తీర్పు కాపీని కూడా ఆయన ఎన్నికల కమిషన్ కు పంపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసిన ఈ లేఖను.. ఎన్నికల కమిషన్ అధికారులు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. సిఈసి నిర్ణయం మేరకు ఏబీ వెంకటేశ్వరరావు కు సంబంధించిన పోస్టింగ్ నిర్ణయం ఆధారపడి ఉండనుంది.
ఐదేళ్ల నుంచి నిరీక్షణ.. పోస్టింగ్ కోసం పోరాటం
వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు పై శాఖాపరమైన చర్యలను తీసుకుంది. ప్రభుత్వం తనపై తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన న్యాయపోరాటాన్ని ఐదేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవి కాలం కూడా ముగియనుంది. ఈనెల 8వ తేదీన క్యాట్ ఇచ్చిన తీర్పు ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద ఉపశమనాన్ని కలిగించినట్టు చెప్పవచ్చు. క్యాట్ తీర్పు వచ్చిన మూడు రోజుల్లో సిఎస్ జవహర్ రెడ్డిని కలిసి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వరరావు కోరారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో.. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్కు లేఖ రాసి అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వెంకటేశ్వరరావు రాసిన లేకపై ఎన్నికల అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. గడిచిన ఐదేళ్లుగా ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈనెలాఖరున పదవీ వివరం చేయను నేపథ్యంలో పోస్టింగ్ లోకి వెళితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈలోగా పోస్టింగ్ పొందలేకపోయినట్లైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఏబీ వెంకటేశ్వరరావు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పదవి విరమణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఆయన ఎన్నికల కమిషన్ కు తాజాగా లేఖ రాసినట్లు అర్థం అవుతోంది.