పల్నాడు జిల్లా క్రోసూరులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన విషాదాన్ని నింపింది. క్రోసూరులో సోమవారం జరిగిన సీఎం జగన్ విద్యా కానుక సభకు హాజరైన ఓ టీచర్ వడదెబ్బతో మృతి చెందారు. ఏలూరుకు చెందిన పద్మావతి (52) అమరావతిలో నివాసం ఉంటున్నారు. ఆమె లింగాపురం జడ్పీ పాఠశాలలో హిందీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగనన్న విద్యా కానుక సభ జరగడంతో క్రోసూరుకు దాదాపు 50 మంది విద్యార్థులను తీసుకుని వెళ్లారు పద్మావతి.
అసలే ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దాంతో సీఎం జగన్ సభకు వెళ్లిన టీచర్ పద్మావతికి వడదెబ్బ తగిలింది. స్వల్ప అస్వస్థతకు గురైన ఆమె ఇంటికి తిరిగొచ్చి విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి రోజు (మంగళవారం) ఉదయం స్కూల్ లో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ ఉండటంతో టీచర్ వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి అస్వస్థతకు గురైన ఆమె స్కూల్ లోనే సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన స్కూల్ మేనేజ్ మెంట్ ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే టీచర్ మృతి చెందారని నిర్ధారించారు. డాక్టర్లు ఆ మాట చెప్పగానే స్కూల్ మేనేజ్ మెంట్ తో పాటు విద్యార్థులు ఆమె కుటుంబసభ్యులు షాకయ్యారు. సీఎం జగన్ సభకు హాజరు కావడమే దెబ్బకొట్టిందని, అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు భావిస్తున్నారు.
సీఎం సభలో విషాదం, గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి!
గత ఏడాది నవంబర్ నెలలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్ పర్యటనలో విషాదం జరిగింది. సీఎం సభకు విధులు నిర్వహించేందుకు వచ్చిన అనకాపల్లి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గుండెపోటుతో మృతిచెందారు. విధుల్లో ఉన్న ఆయన.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కానిస్టేబుల్ ను గమనించిన తోటి పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హెడ్ కానిస్టేబుల్ అప్పారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు అప్పారావు మరి కొద్దిరోజుల్లో ఏఎస్సైగా ప్రోమోట్ అవుతున్నట్లు తోటి పోలీస్ సిబ్బంది తెలియజేస్తున్నారు.
తొలిరోజే విద్యాకానుక అందించిన రాష్ట్ర ప్రభుత్వం
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు. విద్యార్ధుల బంగారు భవిష్యత్తుకు బాటను వేస్తూ, చదువుల భారం మొత్తాన్ని సర్కార్ భరిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. వరుసగా నాలుగో ఏడాది 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పంపిణి చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు.
ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వెళ్లి కానిస్టేబుల్ మృతి..
అమరావతి ప్రాంతంలో రాజధానిలోని ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, పోలీసులకు సరైన వసతి కల్పించలేదని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో బందోబస్తుకు వచ్చి నిద్రిస్తున్న సమయంలో కానిస్టేబుల్ మే నెలలో పాము కాటుకు గురయ్యారు. కానిస్టేబుల్‌ను తోటి పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పవన్ కన్నుమూశారు.