ఏపీలోని పల్నాడు, తిరుపతి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నారని వివిధ బంకులపై 29 కేసులు నమోదు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పిన వివరాలు చూస్తే.. పెట్రోల్ బంకుల్లో అక్రమాలు నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే పల్నాడు,తిరుపతి,బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ పెట్రోల్ బంకుల్లో అక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. అందుకే అధికారులు దాడులు చేసి 29 కేసులను నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 70వేల రూపాయల నుంచి 3లక్షల వరకూ ఫైన్‌ వేసినట్టు ప్రకటించారు.  


కేసులు నమోదు చేసిన బంకులు మళ్లీ అక్రమాలకు పాల్పడితే ఆ బంకుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తామన్నారు మంత్రి నాగేశ్వరరావు. మిగతా 23 జిల్లాలల్లో ఆరు మాసాల్లోగా అన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ, విశాఖపట్నంలోని పలు మాల్స్‌లో తనిఖీలు చేపట్టి 156 కేసులు నమోదు చేసినట్టు కూడా వివరించారు మంత్రి నాగేశ్వరరావు వివరించారు. మిగతా పట్టణాల్లో కూడా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. 


తూనికలు కొలతలు శాఖలో సిబ్బంది కొరతను అధికమించేందుకు 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లను డిప్యూటేషన్‌పై ఇవ్వాలని కోరామని వివరించారు నాగేశ్వరరావు. ఆ ఫైల్‌ ముఖ్యమంత్రి టేబుల్‌పై ఉందని అక్కడ అనుమతి లభించిన వెంటనే తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో మరిన్ని విస్త్రత తనిఖీలకు అవకాశం కలుగుతుందని చెప్పారు.


సిఎం యాప్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక మార్కెట్లు, రైతు బజారులు తదితర మార్కెట్లలో వివిధ నిత్యావసర సరుకుల ధరలను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. వివిధ నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువుల ధరల పెరుగుదల నియంత్రంణలో ఏపీ మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇంకా 300 కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉందని ఆ నిధులు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి పౌరసరఫరాల శాఖకు 600 కోట్లు రావాల్సి ఉందని ఆనిధులను ఇచ్చేందుకు తెలంగాణా రాష్ట్రం ఒప్పుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మూడుప్రాంతాలు సమానాభివృద్ధి జరగాల్సిందేనన్నారు నాగేశ్వరరావు. గతంలో అభివృద్ధి అంతా హైదరాబాదుకే పరిమితం కావడంతో రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయిందన్నారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే ముందు చూపుతో సీఎం జగన్‌ మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని అన్నారు. అలా జరిగితే హైదరాబాద్‌ మాదిరిగానే అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవుతుందన్నారు. ప్రాంతీయ విభేదాలు ఏర్పడతాయని అన్నారు. ఈ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకే కట్టుబడి ఉందన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి నాగేశ్వరవు స్పష్టం చేశారు.