Ambati Rayudu :   ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశంపై జరుగుతున్న వివాదంలో  మాజీ క్రికెటర్, త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్న అంబటి రాయుడు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ  అద్భుతంగా పనిచేస్తుందన్నారు.  వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్ లాంటిదన్నారు.  దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోందని ప్రశంసించారు.  ప్రతి మనిషికి ఏది అందాలో అది వాలంటరీ ద్వారా అందుతుందని చెప్పారు.  వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన అని..  వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని ప్రకటించారు. గుంటూరులో ఆయన వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. 

వాలంటీర్ల వ్యవస్థ గొప్పదన్న అంబటి రాయుడు 

ప్రజలకు మంచిగా సేవలందించే వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదని...  కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారని ప్రశంసించారు.  జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని సలహా ఇచ్చారు.  వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువేనని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారన్నారు.  వాటిని మనం పట్టించుకోకూడదు .. వాలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. 

కీలకమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న పవన్ కల్యాణ్ 

ఏపీలో ఒంటరి మహిళల సమాచారం...  సంఘ విద్రోహ శక్తులకు చేర వేస్తున్నారని.. పవన్ కల్యాణ్ ఆరోపించడంతో వివాదం ప్రారంభమయింది.  వాలంటీర్లు సేకరించే అతి సున్నితమైన సమచారాన్ని ప్రభుత్వంలో పని చేసే కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు.  అందర్నీ అనట్లేదు కానీ కొందరు వ్యక్తులు ఆడపిల్లలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.   కేంద్రంలోని చాలా పెద్ద స్థాయి నిఘా సంస్థల్లో పని చేసే వ్యక్తులు కూడా రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యాలకి కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉంది అని చెప్పారని అంటున్నారు.  అందుకే వాలంటీర్లకు సమాచారం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సున్నితమైన సమాచారాన్ని ఇవ్వకండని ప్రజలకు పిలుపునచ్చారు.  ఈ విషయం చెప్పినందుకు నువ్వు నా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు.  ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు సమాచారం ఎలా తీసుకుంటారు ? 

వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల సమాచారం ఎలా తీసుకుంటారని పవన్ కల్యాణ్ ప్రశఅనిస్తున్నారు.  ఒక MRO తప్పు చేస్తే పై అధికారికి కంప్లైంట్ చేయచ్చు మరి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి చెప్పాలి?  వాలంటీర్లకు ప్రజల డబ్బుతో జీతాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ సమాచారం ఎస్పీ, కలెక్టర్ ఆఫీసుల్లో పెట్టండి. కంప్లైంట్ల కోసం వాట్సాప్ గ్రూప్, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. "హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ మారుతుంది జాగ్రత్త" అని  హెచ్చరిస్తున్నారు.   ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవారంటన్నారు.