తెలంగాణలో రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ చాలంటూ రేవంత్ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఎక్కడో అమెరికాలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేశారని ఆయన ఏ సందర్భంలో చేశారో కూడా తెలియాలన్నారు. 


రేవంత్‌ రెడ్డో, తానో ఎవరో ఏదో చెబితే అది ఫైనల్ అయిపోదాని ఏదైనా పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు కోమిటి రెడ్డి. ఉచిత విద్యుత్‌ అనేది ఈ దేశంలోనే ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రాజశేఖర్‌ రెడ్డి హాయంలో కూడా దీన్ని అప్పటి సీఎం చంద్రబాబు సహా చాలా మంది వ్యతిరేకించారని గుర్తు చేశారు. చివరకు మేనిపెస్టోలో పెడదామంటే సోనియా గాంధీ కూడా వెనుకాడారని చెప్పారు. తప్పకుండా చేయాల్సిందేనంటూ రాజశేఖర్‌రెడ్డి పట్టుబట్టి మరీ మేనిఫెస్టోలో పెట్టించారని అన్నారు. 


ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని కోమటి రెడ్డి చెప్పారు. మొన్న ఖమ్మంలో వచ్చిన ప్రజాదరణ చూసి కొందరు ఓర్చుకోలేక వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చే హామీల్లో 24 గంటల ఉచిత విద్యుత్ ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై ఎవరు ఏం చెప్పినా నమ్మొదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు ఆయన వ్యక్తిగతమైనవని.. ఆయన చెప్తే ఫైనల్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుందన్నారు. స్టార్ క్యాంపెనర్‌గా తాను చెప్తున్నా 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని తేల్చి చెప్పారు. 


తాను, రేవంత్ రెడ్డి కేవలం పార్టీకి కోఆర్డినేటర్స్ మాత్రమేనన్నారు కోమటి రెడ్డి. సీఎం ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని వారి చేతుల మీదుగానే పాలసీలు నిర్ణయమవుతాయని వివరించారు. అంతే కానీ ఎక్కడో ఎవరో ఏదో చెప్పారని దానిపై రాద్దాంతం చేయడం సరికాదన్నారు. 


మరో సీనియర్ నేత మల్లు రవి కూడా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని కమీషన్లు కొట్టేస్తున్నారని వివరించేందుకు రేవంత్ ఈ కామెంట్స్ చేశారని అన్నారు. అంతే కానీ తాము ఉచిత విద్యుత్ ఇవ్వబోమని చెప్పలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి గురించి చెప్పిన విషయాన్ని వక్రీకరించారని అభిప్రాయపడ్డారు. 


అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి దీనిపై పూర్తి వివరాలు అందిస్తారని మల్లు రవి తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ చెప్పిన మాటలే తప్ప పార్టీ అభిప్రాయాలు కావన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారనే బాధతో బీఆర్‌ఎస్ నేతలు రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి చెబుతున్నారని తెలిపారు. 


రేవంత్ ఏమన్నారంటే
తెలంగాణలో ఉన్న 95 శాతం మంది రైతులు 3 ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే అన్నారు. ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఓ గంట చాలని... మూడు ఎకరాలకు ఫుల్‌గా నీళ్లు పారించాలంటే మూడు గంటలు చాలని అభిప్రాయపడ్డారు. టోటల్‌గా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని వివరించారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్లు తీసుకునేందు వ్యవసాయానికి 24 గంటలక కరెంటు స్లోగన్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచితాన్ని అనుచితంగా భావించి స్వార్థానికి వాడుకోకూడదని సూచించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ కాకకు కారణమయ్యాయి.