వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబు అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన సుకన్య అనే మహిళ గురించి మాట్లాడిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.  అయితే ఆ టేప్‌లో ఉన్నది తన వాయిస్ కాదని ఆయన రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆ ప్రచారం ఆగలేదు. ఆయన ఫోన్ నెంబర్ ద్వారా వచ్చిన కాల్‌ లోనే మాట్లాడారని మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  ఈ అంశం విషయంలో తనపై కుట్ర జరుగుతోందని.. కుట్రలన్నింటికీ సమాధానం చెబుతానని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్‌లో ఇతర విషయాలు ఏమీ చెప్పలేదు. 



సుకన్య అంశం విషయంలో తనపై కుట్ర జరుగుతోందని అంబటి రాంబాబుకు ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే ఇలా ట్వీట్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయియ్దనతే ఆయన తన ట్వీట్ ఆ సుకన్య అంశం గురించని చెప్పలేదు.. అలాగని కుట్ర చేస్తున్న వారు ఎవరో కూడా చెప్పలేదు. కేవలం తన పై జరుగుతున్న కుట్రల్నిఛేదిస్తానని మాత్రమే చెప్పారు. నిజానికి విపక్ష పార్టీల వైపు నుంచి ఇలాంటి కుట్రలు జరిగినట్లయితే ఆయన రియాక్షన్ వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన రక్షణాత్మక ధోరణిలో మాట్లాడుతున్నారు. తన పార్టీ నుంచే కుట్ర జరిగిందని  అనుమానిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆ ఆడియో ఫేక్ అయితే  తన పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. నిందితుల్ని పట్టుకోవడం ఎంత సేపని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ విషయంలో అంబటి అంత చురుకుగా వ్యవహరించడం లేదు. 


అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైసీపీలో కీలకమైన నేత. అంతే కాదు ఆయన సామాజికవర్గ పరంగాపార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారు. పవన్ కల్యాణ్ లాంటి వారిపై విరుచుకుపడటానికి ఏ మాత్రం వెనుకాడరు. అదే సమయంలో జగన్ కు అత్యంత విధేయుడు. ఆయనకు మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కారణం ఏమిటో కానీ ఆయనకు చాన్స్ దక్కలేదు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు స్థానం ఖాయమని ఆయన వర్గీయులు నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలోనే అశ్లీలకరమైన ప్రవర్తనకు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి రావడం..ఇదంతా కుట్ర అని అనుమానించడానికి కారణం అవుతోంది. 


అయితే సొంత పార్టీలోనే తనపైకుట్ర జరుగుతోందని నమ్ముతున్న అంబటి... ఆ కుట్రదారులెవరన్నది బయట పెట్టలేదు.  అదరను.. బెదరను అని నిజాలను వెలికి తీస్తానని చెబుతున్నారు. అయితే నిజంగా సొంత పార్టీలో నేతలే ఇలాంటి కుట్రలు చేస్తే.. అంబటి రాంబాబు  ఎప్పటికీ నిజాలను వెలికి తీయలేరని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అసలు విశేషం ఏమిటంటే ఆ ఆడియోటేప్‌పై విచారణ జరిపించాలని ... ఎవరు కుట్ర చేశారో బయట పెట్టాలని అంబటి రాంబాబు ఇంత వరకూ తమ ప్రభుత్వాన్ని కోరలేదు.. డిమాండ్ చేయలేదు.