Sajjala RamaKrishna Reddy : అమరావతిలో జరుగుతుంది ఉద్యమం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, ఆయన బినామీల కుంభకోణం సఫలం కాకపోవడంతో కృత్రిమంగా ఏదో నడిపిస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతుల పేరిట యాత్రలను చేపట్టారని, అది సగం దూరం కూడా పోలేదని ఎద్దేవా చేశారు. అమరావతిలో రైతులందరూ తమ భూములు ఎప్పుడో అమ్మేసుకున్నారని తెలిపారు. మిగిలిన వాళ్లు అంటే పెట్టుబడి పెట్టి లాభాలు వస్తాయనుకున్నవారు కొంతమంది నష్టపోయి ఉండవచ్చన్నారు. ఇవాళ 1200వ రోజు అని అమరావతిలో ఏదో కార్యక్రమం చేశారన్నారు. 1200 కాదు లక్ష రోజులు అయినా ఇలా చేయవచ్చన్నారు. ఒక ప్రణాళికబద్దంగా 200 లేదా 500 మంది శిబిరంలో కూర్చుంటున్నారని, దానిని నడపడం పెద్ద సమస్య కాదని చమత్కరించారు. అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు మద్దతుగా కూడా ఓ ఉద్యమం నడుస్తోందన్నారు. అమరావతిపై ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి చెప్పాలన్నారు.
ప్రపంచమంతా వికేంద్రీకరణకు సపోర్ట్
"అమరావతిలో మౌలిక సదుపాయాలకు మాత్రమే రూ. లక్ష కోట్లు కావాలని అప్పట్లో చంద్రబాబు కేంద్రాన్ని అడిగారు. ముందు రూ.5 లక్షల కోట్లు అడిగారు అనుకోండి. కానీ టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఖర్చు పెట్టింది రూ.5 వేల కోట్ల కన్నా తక్కువే. ఇప్పుడేంటి లక్ష కోట్లు అవసరంలేదు అంటున్నారు. లక్ష కోట్లు కేవలం అమరావతిలో పెట్టాలా? ఇది ముఖ్యమంత్రి లేవనెత్తిన ప్రశ్న. ఇప్పుడు వికేంద్రీకరణ అనేది ఆర్డర్ ఆఫ్ డే అయింది. ప్రపంచం అంతా వికేంద్రీకరణను సపోర్టు చేస్తుంది. ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు సమాధానం చెప్పడంలేదు. కమ్యునిస్ట్ పార్టీలు నిజానికి డిమాండ్ చేయాల్సింది... అమరావతిలో కూలీలు, కార్మికులు తమ ఉపాధి కోల్పోయారు. దీనిపై కమ్యునిస్ట్ పార్టీలు ఆ రోజు నోరెత్తలేదు. పెత్తందారులకు కమ్యునిస్ట్ పార్టీలు ఎందుకు సపోర్టు చేస్తున్నాయి."- సజ్జల
మార్గదర్శి పెద్ద స్కామ్
"బీజేపీ కూడా కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు అమరావతిలోనే అన్ని ఉండాలని ఎందుకు అంటుంది. వీటన్నికంటే అమరావతిలో వేల కోట్ల ల్యాండ్ స్కామ్ జరిగింది. దీనిని ఎవరైనా కాదనగలరా? వేలది ఎకరాలను దోచేశారు. ఇక్కడ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 20 ఏళ్ల పాటు రాజధాని కోసం నిధులు పెడితే రాష్ట్రాభివృద్ధి ఏం అవుతుంది. ఈ రోజు ద్రోహం చేశారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అమరావతిని బంగారు బాతులా చంద్రబాబు చూశారు. కానీ అది సాధ్యం కాకపోయే సరికి రాజకీయం చేస్తున్నారు. టీడీపీ అజెండాలో ప్రజల సంక్షేమమే లేదు. చంద్రబాబు పేరు చెబితే అందరూ ఏకం అవుతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో పర్మిషన్ లేకుండా డిపాజిట్లు సేకరిస్తున్నారు. ఇందులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. గతంలో అగ్రిగోల్డ్, సహారా జరిగినట్లే ఇప్పుడు మార్గదర్శి జరిగాయి. సీఐడీ దర్యాప్తులో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయి. మార్గదర్శి బ్రాంచ్ ల్లో ఉంటే ఫ్లోర్ మ్యాన్ లకు కనీసం చెక్ పవర్ కూడా లేదు. ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మార్గదర్శిపై చర్యలు తప్పవు" - సజ్జల రామకృష్ణా రెడ్డి