Sajjala On Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు షిఫ్ట్ అయింది. హైదరాబాద్ లో ఈ కేసు విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వివేకా వైసీపీ నాయకుడు, సీఎం జగన్  కు  చిన్నాన్న, ఈ  కేసులో రాజకీయాలు ఉండవన్నారు. టీడీపీ వివేకా కుటుంబ సభ్యులతో కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కేసు విచారణలో అంతిమంగా నిజాలు తెలుస్తాయన్నారు. తెలంగాణలో  విచారణ  జరిగితే  ఇంకా మంచిదన్నారు. ఈ కేసులో మాకు ఎలాంటి భయాలు లేవని, దాపరికాలు కూడా లేవని సజ్జల అన్నారు. వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలని, దోషులకు కఠిన శిక్ష పడాలన్నారు. 


రైతులకు న్యాయం చేస్తాం 


"రాజధాని విషయంలో మా స్టాండ్ కు తగ్గట్టే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి. ప్రభుత్వం రాజధాని అంశంలో ఒక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు  కొన్ని మార్గదర్శకాలు చేసింది. రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. రాజధాని అంశం ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు. మూడు రాజధానులతో వికేంద్రీకరణ చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ్టి వరకు అమరావతే  రాజధాని. అదే సుప్రీంకోర్టుకు  చెప్పాం." - సజ్జల రామకృష్ణారెడ్డి 


వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకూ న్యాయం 


రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని స్వాగతిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకు సీఎం జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. వికేంద్రీకరణపై మరింత పకడ్బందీగా చట్టం తెస్తామన్నారు. వైఎస్‌ వివేకానంద హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడాన్ని కూడా స్వాగతిస్తున్నామన్నారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలని తామే ముందు కోరుకుంటున్నామన్నారు. హత్యకు గురైన వివేకా తమ నాయకుడని, సీఎం వైఎస్‌ జగన్ కు చిన్నాన్న అన్నారు. తమ నాయకుడు వివేకా హత్యకు బాధ్యలేవరో తర్వలోనే తెలుస్తుందన్నారు. 


వివేకా కేసు హైదరాబాద్ కు బదిలీ 


వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని, గతంలో సాక్షులు, అప్రూవర్‌గా మారిన వారు కూడా అనుమానాస్పద రీతిలో మరణించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తె ఈ కేసు విచారణ పట్ల బాగా అసంతృప్తితో ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లుగా జస్టిస్ ఎంఆర్ షా వెల్లడించారు.