Jio Network Outage: రిలయన్స్ జియో వాడుతున్నారా? మంగళవారం కొన్ని గంటల పాటు మొబైల్ నెట్‌వర్క్ పనిచేయలేదా? అయితే ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎవరికీ కాల్ చేయలేకపోయారు. కనీసం రిసీవ్ చేసుకోవడానికీ కుదర్లేదు. ఎస్‌ఎంఎస్ సేవలూ ఆగిపోయాయి.
నవంబర్ 29 ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు రిలయన్స్ జియో డౌన్ అయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సమయం నెట్‌వర్క్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్ డేటా పనిచేయడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాలింగ్, ఎస్‌ఎంఎస్ సేవలపై ఎక్కువ ప్రభావం కనిపించింది. దీంతో యూజర్లు జియో ఔటేజ్ గురించి ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. కొందరు మీమ్స్ పంచుకున్నారు.
జియో సేవలు నిలిచిపోవడంతో కొందరు యూజర్లు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సమస్యలు ఎదుర్కొన్నారు. బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్ వంటి చాలా యాప్స్ ఓపెన్ చేసేందుకు ఓటీపీలు అవసరం. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సమస్య వల్ల ఓటీపీలు రాలేదు. జియో ఔటేజ్ వల్ల చాలామంది యూజర్లు ఇబ్బందులు పడ్డ విషయాన్ని ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ సైతం గుర్తించింది. ముంబయి, దిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఎక్కువ ప్రభావం కనిపించినట్టు పేర్కొంది.
సేవలు నిలిచిపోవడంపై రిలయన్స్ జియో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతరాయానికి కారణాలేంటో వెల్లడించలేదు. ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించినట్టు తెలిసింది. జియో సేవలకు అంతరాయం కలగడం ఈ ఏడాది ఇదే తొలిసారి కాదు. అక్టోబర్, జూన్, ఫిబ్రవరిలోనూ డేటా, కాల్స్ ఆగిపోయాయని యూజర్లు రిపోర్టు చేశారు. చాలాసార్లు సాయంత్రం సమయాల్లో డేటా పనిచేయడం లేదని, వేగం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు.