రైతులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని రాష్ట్ర  పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. దళారులు, మిల్లర్లతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చామన్నారు.


రైతులకు ఆదుకున్నది జగనే 


రైతులకు ఎలాంటి నష్టం రాకుండా నేరుగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని రాష్ట్ర  పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. దళారి వ్యవస్థని పూర్తిగా నిర్మూలించామని, ధాన్యం సేకరించి డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొట్టినా రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలికారన్నారు. ప్రతి రైతుకు ఎకారానికి 8 వేల రూపాయల అదనపు లబ్ధి చేకూరిందన్నారు. ప్రతిపక్షాలకు చెందిన రైతులు కూడా ముఖ్యమంత్రిని ప్రశంసిస్తున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నామని, రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 90 శాతం ఇప్పటికే చెల్లింపులు చేశామని, 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ప్రకటించారు.


ఈ ఏడాది మిల్లర్లకు బకాయిలు క్లియర్ 


 మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.900 కోట్లు ఉన్నాయని.. మిల్లర్ల పాత బకాయిలన్నింటినీ ఈ ఆర్థిక సంవత్సరంలో క్లియర్ చేస్తామని ప్రకటించారు. ఇంటింటికీ రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాలకు సంబంధించి  ఇన్సూరెన్స్ మొత్తాన్ని వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లుస్తుందన్నారు. ఇప్పటికే ఎండీయూలు బ్యాంకులకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తే వారందరికీ తిరిగి ఆ మొత్తాన్ని జమచేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 9,260 ఎండీయూ వాహనాలన్నీ  పని చేస్తున్నాయని, ఏ బండీ ఆగలేదని స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా ఇచ్చే కందిపప్పు బాగోలేదని కొంతమంది ఫిర్యాదు చేశారని, వాహనం వద్దే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని అధికారులను  ఆదేశించామని,  విచారణ కొనసాగుతోందన్నారు. లోపాలు ఉంటే తగు చర్యలు తీసుకుంటామన్నారు.


రాగులు..జొన్నలపై సర్వే..


రేషన్ కార్డు దారులకు రాగులు, జొన్నలు తీసుకునే విషయమై వాలంటీర్లతో సర్వే చేశామని, రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరారని వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా రాయలసీమ జిల్లాల్లో పేదలకు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని, దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ  రాగులు, జొన్నలు పంపిణీ చేస్తామని మంత్రి కారుమూరి ప్రకటించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ది చేస్తున్నా.. ప్రభుత్వంపై ఎలాగైనా బురదజల్లాలని ప్రయత్నాలు సరికాదని మంత్రి హితవు పలికారు.


రైస్ మిల్లులుపై చర్యలు...


అక్కడక్కడ కొంతమంది రైస్ మిల్లర్లు వారి రాజకీయదుర్ధేశాలతో సమస్యలు వచ్చాయని, ఇప్పటికే నాలుగు రైస్ మిల్లులను సీజ్ చేశామన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు పండించిన  ప్రతి గింజనూ సేకరిస్తున్నామని తెలిపారు.  రైతుల విజ్ఞప్తి మేరకు రంగు మారిన ధాన్యాన్ని మార్చి 15 వరకూ  కొనాలని నిర్ణయించామని తెలిపారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేయడం వెనుక కొంతమంది దళారులు ప్రోత్సాహం ఉందన్నారు. దళారులే ఆందోళన చేయించినట్లు ఇంటలిజెన్స్ నివేదికలు వచ్చాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.