Minister Botsa : ఉద్యోగులపై ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమం జరిగింది. ఈ సభకు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, ఉద్యోగులు హాజరయ్యారు. ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ సభలో మంత్రి బొత్స మాట్లాడుతూ... ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. 


కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉండాలి- మంత్రి బొత్స 


సర్వీస్‌ నిబంధనల ప్రకారం సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని ఉద్యోగులకు మంత్రి బొత్స  సూచించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను మంత్రుల కమిటీలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే సహనం ఉద్యోగ సంఘాలకు ఉండాలని మంత్రి హితవుపలికారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు ఉంటాయన్నారు. ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి ప్రయత్నించడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ అండగా ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.  


దేశమంతటా ఆర్బీకేలు 


ప్రభుత్వానికి కళ్లు, చెవులు గ్రామ సచివాలయాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్నారని తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా సచివాలయాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. నీతి ఆయోగ్‌ బృందం సచివాలయ వ్యవస్థను అభినందించిందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలను దేశమంతటా ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తుందన్నారు.  సచివాలయ ఉద్యోగులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని అని బొత్స సత్యనారాయణ తెలిపారు. 


పదోన్నతులకు రోడ్ మ్యాప్ - మంత్రి సురేశ్ 
 
గ్రామ, వార్డు సచివాలయాల్లో  500కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సర్వీస్‌ నిబంధన ప్రకారం  ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఉద్యోగుల పదోన్నతులకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం అవుతోందన్నారు. శానిటేషన్‌ ఉద్యోగులకు త్వరలో వీక్లీ ఆఫ్ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. 


సీఎం జగన్ మానస పుత్రికలు 


 ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒకేసారి లక్షా 35 వేల ఉద్యోగాలు ఇవ్వడం చరిత్ర నిలిచిపోతుందన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాలు సీఎం జగన్‌ మానస పుత్రికలు అన్నారు.  సచివాలయాల ఏర్పాటు నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి పాల్గొన్నారు.