Lakshmi Parvati : అన్ స్టాపబుల్ షో లో 1995లో జరిగిన పరిణామాలపై చంద్రబాబు స్పందించారు. ఈ షో ప్రోమో వచ్చినప్పటి నుంచి సంచలనం సృష్టించింది. 1995 ఆగస్టు సంక్షోభం గురించి మొదటిసారి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పందించారు. 1995 ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 1995 పరిణామాలపై చంద్రబాబు మొదటిసారి నోరు విప్పారన్నారు. చంద్రబాబు 40-50 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారని అప్పుడు ఎన్టీఆర్ తనతో చెప్పారని లక్ష్మీ పార్వతి చెప్పారు. వేరే పార్టీ పెట్టేందుకు చంద్రబాబు అప్పుడు దాసరి నారాయణరావు, చిరంజీవిని కలిశారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. టీడీపీ ఓడిపోతుందని కూడా చంద్రబాబు అప్పుడు ప్రచారం చేయించారన్నారు. తమ పెళ్లి కారణంగా టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారని  లక్ష్మీపార్వతి ఆరోపించారు.


చంద్రబాబు అధికార దాహమే! 


టీడీపీలో తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆనాడు తాను పార్టీలో ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎన్టీఆర్ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార దాహంతో చంద్రబాబు కుట్ర చేసి పార్టీ లాగేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికార దాహమే ఎన్టీఆర్‌ను చంపేసిందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్టీఆర్ తనకు ఇష్టమైన వారికి సీట్లు ఇచ్చారన్న కోపంతో కొంతమంది ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి చంద్రబాబు ఆందోళనలు చేయించారన్నారు. పార్టీ క్రమశిక్షణా చర్యలు కింద కొంత మంది ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ సస్పెండ్ చేశారు. 20 మందిని సస్పెండ్ చేశారని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు.  అన్ స్టాపబుల్ షో లో ఇద్దరు వెన్నుపోటుదారులు ఒకరినొకరు సమర్ధించుకున్నారని బాలకృష్ణ, చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చంద్రబాబుకి ఇప్పటికీ నిజం చెప్పాలన్న మానవత్వం లేదన్నారు.  బాలకృష్ణను బాగా అభిమానించనని, కాని వారి మాటలు వింటే అసహ్యం వేస్తుందన్నారు. బావను కాపాడటానికి బావమరిది రంగంలోకి దిగారని మండిపడ్డారు. ఈ షోలో బాలకృష్ణ, చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. 


బిగ్ డెసిషన్ 


నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్ అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు 1995 నాటి ఆగస్టు సంక్షోభం తెరవనుక పరిస్థితులపై తొలి సారిగా స్పందించారు. ఇప్పటి వరకూ అందరూ తననే నిందిస్తున్నా.. ఆ సంక్షోభ సమయంలో తనవైపు ఉండి చివరికి పార్టీలు మారి తననే వేలెత్తి చూపిస్తున్నా ఇప్పటి వరకూ చంద్రబాబు స్పందించలేదు. కానీ తొలిసారి ఆ అంశంపై బాలకృష్ణ షోలో స్పందించారు. తన  జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ అని అప్పుడేం జరిగిందో వివరించారు. 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ పూర్తిగా బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్రభావంలో ఉండిపోయారన్నారు. అయితే ఆ వ్యక్తి లక్ష్మి పార్వతి అని చంద్రబాబు చెప్పలేదు. ఆమె పేరును కూడా ప్రస్తావించలేదు. పరిస్థితులు పూర్తిగా దిగజారిపోతున్నాయని.. ఈ అంశంపై మాట్లాడేందుకు బీవీ మోహన్ రెడ్డి, బాలకృష్ణ, రామకృష్ణలతో కలిసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లామన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ను కాళ్లు పట్టుకుని బతిమాలుకున్నామన్నారు. అయినా వినకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. అందరం కలిసి చర్చించిన తర్వాతనే పార్టీని కాపాడుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 


Also Read : Babu Balakrishna AHA : అన్‌స్టాపబుల్ క్లారిటీ - ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు చెప్పిన సీక్రెట్స్ ఇవే