Nadendla Manohar On Liquor Bonds : ఏపీలో మద్య నిషేధం అంటే మద్యం ఆదాయం పెంచడమే అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ సంపూర్ణ మద్యపాన నిషేధమంటూ అధికారం చేపట్టి ఇప్పుడు మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల టైంలో మద్యం ద్వారా రూ.9 వేల కోట్ల ఆదాయం వస్తే వైసీపీ అధికారంలో వచ్చాక మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని మనోహర్ ఆరోపించారు. ఇదేనా వైసీపీ మద్యపాన నిషేధం అని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగిందని నాదెండ్ల మనోహర్ ట్వీట్‌ చేశారు. 


స్పిరిటెడ్ విజనరీ 


మద్యం రాబడి చూపించి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బాండ్లు అమ్ముతున్నారన్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇది స్పిరిటెడ్ విజనరీ అంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం జగన్‌ మేనిఫెస్టో పెట్టిన మద్యపాన నిషేధం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. మద్యం ద్వారా అధిక ఆదాయం సంపాదించడంతో పాటు అప్పు కూడా తీసుకుంటూ సీఎం జగన్‌ జాక్‌పాట్‌ కొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యనిషేధం పాక్షికంగా కూడా ఉండదని కార్పొరేషన్‌కు ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. వివిధ రకాల లిక్కర్‌  బ్రాండ్లను విడుదల చేసి జగన్ సర్కార్ రూ.8 వేల కోట్లు సేకరించిందన్నారు. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వానికి మూడు నెలలకు ఓసారి వడ్డీ ఇస్తామని కార్పొరేషన్‌ తెలిపింది. 






రూ.8 వేల కోట్ల రుణాలు సేకరణ


ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ బాండ్లను వేలం రూ. 8 వేల కోట్ల రుణాలను సమీకరించుకుంది. ఏపీ ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ( NCD ) ఆఫర్ చేసి రూ. రెండు వేల కోట్లను సమీకరించాలనుకుంది. అయితే అనూహ్యంగా ఈ ఎన్‌సీడీల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఐదు రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. అయితే తాము రూ. ఎనిమిది వేల కోట్లు మాత్రమే తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


9.5 శాతం వడ్డీతో


గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి బాండ్లను వేలం వేసి రూ. రెండు వేల కోట్ల రుణాలను సమీకరించారు. ఇప్పుడు లిక్కర్ బాండ్లను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఎలాంటి ప్రచారం లేకుండా ప్రభుత్వం పూర్తి చేసింది. రూ. ఎనిమిది వేల కోట్లకు 9.5 శాతం వరకూ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. రేటింగ్ సంస్థలు స్టేబుల్ కేటగిరి కింద రేటింగ్ ఇవ్వడంతో రుణ సమీకరణ సులువు అయింది.