CM Jagan Party Meet : వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌ల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రుగుతున్న స‌మావేశం కావ‌డంతో పార్టీ నేత‌ల్లో చ‌ర్చగా మారింది. 'జ‌గ‌న‌న్నే మా భ‌విష్యత్తు' క్యాంపెయిన్ పై కేడర్ కు దిశా నిర్ధేశం చేయ‌నున్నారు సీఎం. ఎమ్మెల్యేల ప‌నితీరు, గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్యక్రమంపై స‌మీక్షించ‌నున్నారు సీఎం. మంత్రి వర్గ మార్పులు పైనా చర్చ జరిగే  అవకాశం  ఉంది.


గడప గడపకూ కార్యక్రమం


పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వహించనున్నారు. వ‌చ్చే సోమవారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు తాడేపల్లి క్యాంప్ కార్యాల‌యంలో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవ‌రి 13న చివ‌రిసారిగా ఎమ్మెల్యేల‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత పార్టీలో కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ లో జ‌రిగే స‌మావేశం ద్వారా నేత‌ల ప‌నితీరుపై ఒక నిర్ణయానికి వ‌స్తాన‌ని గ‌తంలోనే సీఎం చెప్పారు. దీంతో ఈసారి స‌మావేశంలో ఎవ‌రి భ‌విష్యత్ ఏంట‌నే దానిపై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నారు పార్టీ నేత‌లు..గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రమంతో పాటు స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, గృహ‌సార‌థుల ప‌నితీరుపైనా ఈ సమావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉందంటున్నారు పార్టీ నేత‌లు.


జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ 


ఇక ఈనెల 18 నుంచి 26 వ‌ర‌కూ జ‌గ‌న‌న్నే మా భ‌విష్యత్తు క్యాంపెయిన్ నిర్వహించాల‌ని భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక‌లతో ఆ కార్యక్రమం వాయిదా ప‌డింది. దీంతో మ‌ళ్లీ వచ్చే నెల రెండో వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఎలా నిర్వహించాల‌నే దానిపై కేడ‌ర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. జ‌గ‌న‌న్నే మా భ‌విష్యత్తు క్యాంపెయిన్ ద్వారా గ‌త ప్రభుత్వం క‌న్నా ఈ ప్రభుత్వం అందించిన పాల‌న‌, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ వివ‌రించేలా ప్రభుత్వం ముందుకెళ్లనుంది. ఇప్పటికే సుమారు 8 వేల స‌చివాల‌యాల్లో గ‌డ‌ప గడ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వం. ఇక మిగిలిన స‌చివాల‌యాల్లో కూడా త్వరిత‌గ‌తిన కార్యక్రమం పూర్తిచేయాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించ‌నున్నారు.


నేతల్లో టెన్షన్ 


ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అనుకోని ప‌రిస్థితి ఎదుర‌వ్వడంతో ఈసారి స‌మావేశం హాట్ హాట్ గా జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇప్పటికే ప‌నితీరు మార్చుకోని మంత్రులలో కొంతమందిని మార్చేస్తాన‌ని ప‌లుమార్లు హెచ్చరించారు సీఎం జ‌గ‌న్. నివేదిక‌ల ఆధారంగా ఎలాంటి కీల‌క ప్రక‌ట‌న చేస్తారని వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జులు టెన్షన్ ప‌డుతున్నారు. మొత్తానికి సోమవారం జరిగే స‌మావేశంలో కీల‌క ప్రక‌ట‌న‌లు ఉంటాయంటున్నారు పార్టీ నేత‌లు.  


ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నం ఫలించలేదు. మెజార్టీ స్థానాల్లో వైసీపీ గెలిచినా... పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో మూడు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో వైసీపీ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. ఇప్పటికే క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.