CM Jagan Meets Governor : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి దంపతులకు గవర్నర్  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్, సీఎం దాదాపు గంటకు పైగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై ఈ భేటీలో చర్చించారు. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన ప్రజలకు మరింత చేరువైందని సీఎం గవర్నర్ కు వివరించారు. నూతన జిల్లాలలో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి దంపతులు జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. 






సీఎంతో విక్రమ్ రెడ్డి భేటీ 


ఆత్మకూరు స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో తనయుడు విక్రమ్ రెడ్డిని ఖరారు చేశారు. ఆయన తండ్రితో కలిసి సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కలిశారు. గౌతంరెడ్డిలాగే విక్రమ్ రెడ్డిని కూడా ప్రోత్సహించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్‌ను కోరారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్‌తో సమావేశం తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా మా రెండో అబ్బాయికి విక్రమ్ ని నిర్ణయించామని రాజమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వస్తే మిగతా విషయాలు బయటకు వస్తాయన్నారు. 






ఆత్మకూరులో ఏకగ్రీవం అవుతుందో... లేకపోతే ఎంత మంది పోటీలో ఉంటారన్న విషయం  షెడ్యూల్ వచ్చిన తర్వాతే తేలుతుందన్నారు. నియోజకవర్గానికి వెళ్లేముందు జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్ ని తీసుకు వచ్చమన్నారు.  అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నాని...గౌతంరెడ్డి ఆశయాలను  ముందుకు తీసుకు వెళ్తానని విక్రమ్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి అన్న చేయాలనుకున్నది నేను చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.