Vasireddy Padma : మూడు పెళ్లిళ్లపై ఇటీవల జనసేన రాష్ట్ర  అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని రాష్ట్ర  మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. ఈ మేరకు శనివారం  జనసేనాని పవన్ కల్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని తెలిపారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్నిస్తూ పవన్ కల్యాణ్  మాట్లాడిన మాటలతో మహిళాలోకం షాక్ కు గురైందన్నారు. తన మాటల్లోని తప్పు తెలుసుకుని పవన్ కల్యాణ్ మహిళా లోకానికి వెంటనే సంజాయిషీ ఇస్తారని మహిళా కమిషన్ ఎదురు చూసిందన్నారు. ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ లో పశ్చాత్తాపం లేదని, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు క్షమాపణలు కూడా లేవన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమేనన్నారు. 


అలా ఎలా మాట్లాడుతారు?  


కోట్ల రూపాయల భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, చేతనైతే మీరు కూడా చేసుకోండని అత్యంత సాధారణ విషయంగా ఎలా మాట్లాడగలిగారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణమిచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే ఏ మహిళ జీవితానికి  భద్రత ఉంటుంది? ఒక సినిమా హీరోగా, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పెళ్లిళ్లపై మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చనే అభిప్రాయాన్ని తలకెత్తుకోరా? అని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నిలదీశారు.  


మహిళా భద్రతకు పెను ప్రమాదం 


పవన్ ప్రసంగంలో మహిళలను ఉద్దేశించి 'స్టెప్నీ' అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపణీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించే వారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేకమంది మహిళలు ఫిర్యాదు చేశారని, పవన్ మాటలు  అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మహిళలను కించపరిచే మాటలు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై  పవన్ కల్యాణ్ తక్షణమే క్షమాణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  నోటీసులు జారీ చేసినట్లు  రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.


 సీఎం జగన్ కౌంటర్ 


పవన్‌కు సీఎం జగన్ కూడా కౌంటర్ ఇచ్చారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమని సందేశం ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.  "మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఏకంగా టీవీల్లో నాయకులుగా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతున్నారు. మీరూ ఆలోచన చేయండి. రేపొద్దున మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన ఇంట్లో కూతుర్ల పరిస్థితి ఏంటి? చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు నాలుగేళ్లు కాపురం చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది. ఒకసారి కాకుండా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఆడవాళ్ల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు? వీరు మనకు దశా దిశా చూపగలరా? " అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే కోణంలో మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.