Actor Joginaidu : టాలీవుడ్ లోని వైసీపీ మద్దతుదారులకు పదవులు దక్కుతున్నాయి. అలీ, పోసాని తర్వాత ఆ లిస్ట్ లో చేరారు జోగినాయుడు. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా జోగినాయుడును ఏపీ ప్రభుత్వం నియమించింది.  జోగి నాయుడు క్రియేటివ్ హెడ్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు.  జోగినాయుడు నియామకానికి తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను ఆదేశించారు.  1998లో జెమిని టీవీలో ప్రసారమైన జోగి బ్రదర్స్ కార్యక్రమంతో జోగినాయుడు పేరు తెచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర యాసతో మాట్లాడుతూ గుర్తింపు పొందారు. డైరక్టర్ అవుదామని వచ్చిన జోగి నాయుడు టీవీ రంగంలో కెరీర్ ప్రారంభించారు. దర్శకులు పూరీ జగన్నాథ్, కృష్ణవంశీతో కలిసి పనిచేశారు జోగినాయుడు. 


అలీ, పోసానికి కీలక పదవులు 


వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ ఇటీవల బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జీవోలో ప్రకటించారు. ఈ నియామకానికి సంబంధించి ఇతర వివరాలతో మరో ఉత్తర్వు జారీ చేస్తామని ఐ అండ్ పీఆర్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టీ విజయ్ కుమార్ రెడ్డి పేరుతో జీవో విడుదలయింది.  ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌  ( ఏపీఎస్‌ఎఫ్‌టీటీడీసీ ) సినిమా టీవీ, నాటక రంగానికి సంబంధించినది. ఈ పదవిలో ఆయన ఎంత కాలం ఉంటారన్నది ఉత్తర్వుల్లో లేదు.  బహుశా ఏడాది వరకూ పదవి ఉంటుందని. .. ఆ తర్వాత పొడిగిస్తారని చెబుతున్నారు.  ఇటీవలే టాలీవుడ్‌కు చెందిన మరో వైఎస్ఆర్‌సీపీ నేత అలీకి సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారు. ఆ పదవితో ఆలీ సంతృప్తి చెందారు. తన కుమార్తె పెళ్లికి జగన్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానని సంతోషపడ్డారు.  ఆయనకు రెండేళ్ల పదవీ కాలం ఉంది. 


పోసాని విధేయతను ఇన్నాళ్లకు గుర్తించిన సీఎం జగన్ 


పోసాని కృష్ణమురళి సీఎం జగన్‌కు వీరాభిమాని. ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే..  బూతులతో విరుచుకుపడతారు.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌తో పాటు పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ అందర్నీ ఆయన అసభ్యంగా దూషించిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ.. పదవి లభించలేదు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల అంశంపై సంప్రదింపులు జరిపినప్పుడు ..  అలీతో పాటు పోసానిని కూడా ఆహ్వానించింది. ఆ తర్వాత  పోసాని కృష్ణమురళి మరోసారి సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అప్పట్లోనే పదవి లభిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పదవి ఇచ్చారు. టాలీవుడ్ లో వైసీపీకి మద్దతుగా ఉన్న వాళ్లకు వరుసగా పదవులు దక్కుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదే ఉండడంతో సీఎం జగన్ కీలకంగా పదవులు కేటాయిస్తున్నారు.