AP Cabinet Meet : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గం భేటీ అవుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో సమావేశం జరగనుంది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రకటన చేశారు. అన్ని శాఖల కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కేబినెట్ భేటీ 13వ తేది ఉ.11గం.లకు జరగాల్సి ఉందని కానీ అనివార్య కారణాలతో మంత్రివర్గ సమావేశాన్ని 12వ తేదీకి మార్పు చేశారని సీఎస్ తెలియజేశారు.


కొత్త కేబినెట్ తొలి భేటీ 
 
ఏపీ నూతన మంత్రివర్గం మే 12న సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యుత్ కోతల నివారణ, మే నెలలో నుంచి నీటి ఎద్దడి, పోలవరం ప్రాజెక్ట్ వంటి విషయాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేయడంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టనుంది. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా కొత్త నిర్ణయాలు ఉంటాయని సమాచారం.


కీలక అంశాలపై చర్చ 


సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా కొత్త మంత్రివర్గం భేటీ అవుతోంది. కొత్త మంత్రులందరూ బాధ్యతలు స్వీకరించి తమ శాఖలపై సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సీఎం జగన్ తమకు కేటాయించిన జిల్లాల బాధ్యతలు నిర్వర్తిస్తూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకునే పనిలో పడ్డారు కొత్త మంత్రులు. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని సీఎస్ నుంచి అన్ని శాఖలు, విభాగాధిపతులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు పొత్తుల గురించి ప్రస్తావించడం, అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని వ్యాఖ్యానించడం వైఎస్సార్‌సీపీలో చర్చకు దారితీస్తుంది. ఇప్పటివరకూ ఓ ఎత్తు, ఇకనుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు పరిపాలన మరో ఎత్తు అని కొత్త కేబినెట్‌లో మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి, పనుల పురోగతిపై ఏపీ కేబినెట్ భేటీలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రం చేస్తున్న అప్పులు, ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు సమకూర్చడం లాంటి విషయాలు కేబినెట్ లో చర్చించనున్నారు.