ఒకప్పుడు బ్రిటీష్‌ పాలకుల నుంచి విముక్తి పొందేందుకు భారత జాతి పిత మహాత్మాగాందీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ పాదయాత్ర స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకంగా మారింది. ఇదే బ్రిటీష్‌ వారిని తరిమికొట్టేందుకు ఉపకరించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పాదయాత్రలు చేశారు. అందులో వినోభాబావే ఆర్థిక సమానత్వం కోసం చేపట్టిన భూదాన్‌ యాత్ర కూడా చేప్పుకోదగినదే. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర ఓ సెంటిమెంట్‌గా మారింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండు సార్లు ఓటమి పాలైన తర్వాత ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మూడు నెలలో 1,475 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పాదయాత్ర సెంటిమెంట్‌ రాజకీయంగా బలం చాటుకుంది.


పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన ఇద్దరు నేతలు..
ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 2012లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సుమారు రెండు వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అయితే ఇదే సమయంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉండటంతో చేత జగన్‌ సోదరి వై.ఎస్‌.షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరుతో 2013లో చేసిన 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర మాత్రం సత్పలితాలు అందించలేదు. అప్పటికే చంద్రబాబు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పాదయాత్ర చేయడం ఆయనకు కలిసి వచ్చిందనే నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ తర్వాత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలోని 13 జిల్లాలో సుమారు ఏడాదిపాటు సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. రోజుకు 15 నుంచి 30 కిలోమీటర్ల మేరకు సాగుతూ 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఆ త‌ర్వాత‌ 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.


పొలిటికల్‌ ట్రెండ్‌గా పాదయాత్ర..
2003లో వై.ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో ప్రారంభమైన ఈ పాదయాత్రలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్‌ ట్రెండ్‌గా మారాయి. పాదయాత్ర చేస్తే తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతోనే అన్ని పార్టీలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అదే ట్రెండ్‌ కొనసాగుతుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే పాదయాత్రను చేపట్టారు. దీంతోపాటు తెలంగాణలో రాజన్న రాజ్యం అనే నినాదంతో ఏర్పాటైన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నాయకురాలు వై.ఎస్‌.షర్మిల సైతం పాదయాత్ర జోరును కొనసాగిస్తున్నారు. మరోవైపు ఐపీఎస్‌కు రాజీనామా చేసి బహుజన రాజ్యాధికారమే లక్ష్యం అంటూ బీఎస్పీలో చేరిన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సైతం రాజ్యాధికార యాత్రను చేపట్టారు. ఇదిలా ఉండగా సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గం అయిన మధిరలో పాదయాత్ర చేపట్టారు. మరోవైపు తెలంగాణలో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సైతం పాదయాత్ర చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధిష్టానం అనుమతి కోసం లేఖ రాశారు.


పాదయాత్ర అధికారం తెచ్చిపెడుతుందా..?
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రమే బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం రాజశేఖర్‌రెడ్డి మాత్రమే పాదయాత్ర చేయడం ఆయనకు కలిసొచ్చిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన పాదయాత్రలకు సైతం అలానే సానుకూల పలితాలు వచ్చాయి. పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పార్టీని తీసుకెళ్లాలనే బలమైన సంకల్పంతోపాటు కార్యకర్తల్లో జోష్‌ నింపడం ద్వారా ఆయా పార్టీలు గెలిచేందుకు మార్గాన్ని సుగుమం చేసుకునే అవకాశం ఉంది. 


మరోవైపు అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలు పనికివస్తాయి. ఇక పాద‌యాత్రలు అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మ‌ధ్య అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాద‌యాత్రలు చేస్తున్న ముగ్గుర్ని ఒక్కమాటతో ఆయ‌న తీసి పారేసిన‌ట్లయింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో యాత్ర ట్రెండ్‌ నడుస్తుండటం, ప్రతిపక్షాలు ప్రజల వద్దకు అని బయలు దేరుతుండటంతో మరి ఎవరి పాద ముద్ర వారి పార్టీకి అధికారాన్ని తెచ్చిపెడుతుందనే చర్చ సాగుతుంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోసం పాదయాత్ర ట్రెండ్‌ బలంగా నాటుకోవడం విశేషం.
- గోపరాజు బ్రహ్మండభేరి