ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణలపై అమరావతి భూముల విషయంలో మరోసారి కేసులు నమోదు చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాలు అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఏప్రిల్ 4 వ తేదీన మంగళగిరి సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.  దీనిపై ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. మే 6వ తేదీ ప్రాథమిక నివేదిక సిద్దం చేశారు. మే 9 వ తేదీన కేసు నమోదు చేశారు. మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చి ఎఫ్ ఐఆర్  నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, మజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేష్, ప్రభుత్వ అధికారులు నిందితులుగా పేర్కొన్నారు. 




 


రాజధాని ల్యాండ్ పూలింగ్‌పై నమోదు చేసిన కేసుల్లో చంద్రబాబు, నారాయణతో పాటు మొత్తం పధ్నాలుగు పేర్లు ఉన్నాయి. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు, అధికారులు అనే పేరుతో పధ్నాలుగో కాలమ్ ఉంచారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన దాని ప్రకారం రాజధానికి భూములిచ్చిన  రైతులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే ఫిర్యాదు చేశారు. ల్యాండ్ పూలింగ్ కేసులు గతంలోనే తేలిపోయాయి కాబట్టి ఈ సారి కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు.   గతంలో ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ..  ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరుడు జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది లేదని సుప్రీంకోర్టు తేల్చింది. 



 


రాజధాని భూముల్లో భారీ అక్రమాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ఎలాంటి అవినీతి నిరూపించలేకపోయారు. పైగా అమరావతికి భూముల్చిచన ముఫ్పై వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా అక్రమాలు జరిగాయని పిర్యాదు చేయలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుడు జూపూడి జాన్సన్ పేరుతో గతంలో ఫిర్యాదులు చేయడంతో... అమరావతి ప్రాంతంలో భూములు ఉన్న అనేక మందిపై కేసులు నమోదు చేశారు. అయితే సుప్రీంకోర్టు  ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది లేదని తేల్చి చెప్పింది. ఈ సారి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాల పేరుతో కేసులు పెట్టి అరెస్టులు ప్రారంభించారు.