Actor Ali : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా  సినీనటుడు మహమ్మద్ అలీ బాధ్యతలు స్వీకరించారు.  తనను సలహాదారుగా నియమించినందుకు సీఎం జగన్ కు అలీ కృతజ్ఞతలు తెలిపారు.  ప్రభుత్వానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని అలీ ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండో అంతస్థులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అందించిన నియామక పత్రం స్వీకరించి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. 


తండ్రిని మించిన తనయుడు 


సలహాదారుగా విలువైన సలహాలు, సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ, మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని అలీ తెలిపారు. ప్రజాభిమానం పొందిన గొప్ప నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అలీ కొనియాడారు. ప్రజల పట్ల సీఎం జగన్ చూపించే అభిమానం వెలకట్టలేనిదన్నారు. ప్రజలకు మేలు చేసే విషయంలో ముఖ్యమంత్రి అనుకున్నది సాధిస్తారన్నారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ కీర్తి, ప్రతిష్టలు సాధించారని, గొప్ప ప్రజా నాయకుడిగా, మహా నాయకుడిగా పేరొందారన్నారు. ఇచ్చిన మాటను,చెప్పిన మాటను తూ.చ తప్పకుండా ఆచరించి చూపిస్తున్నారన్నారు. 


సంక్షేమ ప్రభుత్వం 


రాష్ట్రంలో నవరత్నాలు పటిష్టంగా అమలవుతున్నాయని చెప్పిన అలీ.. ఇటీవల తాను విశాఖలో పర్యటించిన విషయాలను వెల్లడిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ విధానాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయన్నారు. ఏ వీధిలో చూసినా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలు కనిపించాయన్నారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటుడు, మానవతావాది అలీ అని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేగాకుండా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ సమర్థవంతంగా సేవలను అందిస్తారన్నారు.


పోసానికి కీలక పదవి 


 వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జీవోలో ప్రకటించారు. ఈ నియామకానికి సంబంధించి ఇతర వివరాలతో మరో ఉత్తర్వు జారీ చేస్తామని ఐ అండ్ పీఆర్ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ టీ విజయ్ కుమార్ రెడ్డి పేరుతో జీవో విడుదలయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌  ( ఏపీఎస్‌ఎఫ్‌టీటీడీసీ ) సినిమా టీవీ, నాటక రంగానికి సంబంధించినది. ఈ పదవిలో ఆయన ఎంత కాలం ఉంటారన్నది ఉత్తర్వుల్లో లేదు.  బహుశా ఏడాది వరకూ పదవి ఉంటుందని. .. ఆ తర్వాత పొడిగిస్తారని చెబుతున్నారు.  ఇటీవలే టాలీవుడ్‌కు చెందిన మరో వైఎస్ఆర్‌సీపీ నేత అలీకి సలహాదారు పదవి ఇచ్చారు. ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చారు. ఆ పదవితో ఆలీ సంతృప్తి చెందారు. తన కుమార్తె పెళ్లికి జగన్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానని సంతోషపడ్డారు.  ఆయనకు రెండేళ్ల పదవీ కాలం ఉంది. 


Also Read : Goutham reddy book : గౌతమ్ రెడ్డి 'చిరస్మరణీయుడు', సీఎం చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరణ