YSRCP News :  వైఎస్ఆర్‌సీపీ పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ ప్రస్తుతం క్రియాశీల సభ్యత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్వాములు పేరుతో చీరాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చీరాలలోని ఆమంమచి అనుచరులు జనసేన క్రయాశీల సభ్యత్వం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో  ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కలకలం బయలుదేరింది. ఎన్నికలకు ముందు పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయేమోనని ఇతర నేతలు ఆందోళన చెందుతున్నారు.       

  


గతంలో చీరాలలో టీడీపీ, వైసీపీలను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ 


ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో నవోదయం  అనే సొంత పార్టీ పెట్టుకుని చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ రెండో స్థానంలో ఉండగా.. వైఎస్ఆర్‌సీపీ మూడో స్థానంలో నిలబడింది. ఆ తర్వాత కృష్ణమోహన్ టీడీపీలో చేరారు. కానీ ఎన్నికలకు ముందుగా పార్టీ మారి... వైఎస్ఆర్‌సీపీలో చేరారు. కానీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కరణం  బలరాం చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ గా కొనసాగుతూ..  అధికార పార్టీ నేతగా తన హవా కొనసాగించారు. కానీ ఎప్పుడైన ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుంచి ఫిరాయించి  వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో సీన్ మారిపోయింది. 


కరణం బలరాం వైసీపీలో చేరడంతో  పర్చూరుకు ఆమంచిని పంపిన సీఎం జగన్            


కరణం బలరాం అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరలేదు కానీ.. ఆయన కుమారుడు చేరిపోయారు. ఇప్పుడు వారిద్దరూ చీరాలలో వైఎస్ఆర్‌సీపీని లీడ్ చేస్తున్నారు. కానీ తన పట్టు నిలుపుకునేందుకు చాలా రోజులుగా వారికి పోటీగా ఆమంచి కృష్ణమోహన్ ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తన వర్గాన్ని కూడా నిలబెట్టారు. అయితే పార్టీ ఫిరాయించినప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ను కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కే ఇచ్చేందుకు జగన్ నిర్ణయించారు. ఆమంచి కృష్ణమోహన్ కు న్యాయం చేసేందుకు ఆయనకు పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు. కానీ పర్చూరు విషయంలో ఆమంచి  అంత సంతృప్తిగా లేరని.. ఎలాగైనా చీరాల నుంచే  పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. 


వచ్చే ఎన్నికల ఆలోచనతోనే ఆమంచి  సోదరుడు జనసేన బాట పట్టారా ?             


ఆమంచి కృష్ణమోహన్ తో పాటు ఆయన సోదరుడు స్వాములు కలిసే రాజకీయాలు చేస్తూంటారు.  దీంతో ఆమంచి స్వాములు ఇప్పుడు జనసేనలో చేరే దిశగా ఉండటంతో వైఎస్ఆర్‌సీపీలో సంచలనం అవుతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండి.. పొత్తులో భాగంగా చీరాల జనసేనకు వస్తే అక్కడి నుంచి ఆమంచి  సోదరుల్లో ఒకరు పోటీ చేస్తారని చెబుతున్నారు. పొత్తు ఉంటే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆమంచి సోదరుల రాజకీయం వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.