Todd Murphy Record: ఆస్ట్రేలియా యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అరుదైన రికార్డును అందుకున్నాడు. భారత్ తో తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ.. తన తొలి మ్యాచ్ లోనే 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
141 ఏళ్ల రికార్డ్ బద్దలు
నాగ్ పూర్ వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రంలోనే 7 వికెట్లు తీశాడు. రెండో రోజు 5 వికెట్లు తీసిన మర్ఫీ.. మూడో రోజు మరో 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అతి పిన్న వయసులో 5 అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది.
జోయ్ ప్లామర్ 1882లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 5 వికెట్ల ఘనతను సాధించాడు. అప్పుడు జోయ్ వయసు 22 ఏళ్ల 360 రోజులు. తాజాగా టాడ్ మర్ఫీ 22 ఏళ్ల 87 రోజుల వయసులోనే అరంగేట్ర టెస్టులో 7 వికెట్లు తీశాడు. అంటే 141 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా అరంగేట్రంలోనే 5 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా నాలుగో ఆఫ్ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు. మర్ఫీ కన్నా ముందు పీటర్ టేలర్, జాసన్ క్రూజా, నాథన్ లియాన్ లు ఉన్నారు.
భారీ ఆధిక్యంలో భారత్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84), షమీ (47 బుంతుల్లో 37) అద్భుతంగా రాణించి భారత్‌కు మంచి స్కోరు అందించారు. అక్షర్ కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు.
రాణించిన బ్యాటర్లు
కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120), ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( 185 బంతుల్లో 70), అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84) లు రాణించటంతో ఆస్ట్రేలియా పై పైచేయి సాధించింది. సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
జడేజా ఆల్ రౌండ్ షో
తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో ప్రదర్శించాడు. బంతితో 5 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. బ్యాట్ తోనూ 70 పరుగులు చేశాడు. అక్షర్ తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన జడేజా జట్టు భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు.