గోశామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి టాక్‌ఆఫ్‌ది స్టేట్ అయ్యారు. తనకు ప్రభుత్వం కేటాయించిన వెహికల్‌ను వదిలేసి బైక్‌పై అసెంబ్లీకి వచ్చారు. ఇప్పటికే బులెట్ ప్రూఫ్ వాహనంపై వివాదం నడుస్తోంది. ఇప్పుడు వాటన్నింటిని కాదని.. ఆయన టూవీలర్‌పై అసెంబ్లీకి రావడం ఆశ్చర్య కలిగించింది. 


నిన్న ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే రాజా సింగ్‌... అక్కడే తన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి వచ్చారు. తరచూ ఆ వెహికల్ మొరాయిస్తుందని ఆరోపిస్తూ తనకు అలాంటి వెహికల్ వద్దని వదిలేసి వచ్చారు. దీంతో ఇవాళ టూవీలర్‌పై వచ్చారు. ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టిన కారును పోలీసులు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం‌ టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. అయితే వాహనం కండీషన్ సరిగ్గా లేదని, నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా దూల్ పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఘటన జరిగింది. ఒకవేళ వాహనం రెగ్యూలర్ తరహాలో వేగంగా వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగేదని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. 


బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంతకాలంగా ప్రభుత్వానికి రాజా సింగ్ రిక్వెస్ట్ చేశారు. తన భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వాహనాన్ని ఇకనైనా వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గులేదు!


తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండీషన్ సరిగా లేదని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు రాజా సింగ్. తెలంగాణ హోం మంత్రికి, సీఎం కేసీఆర్ కు సిగ్గు శరం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తాను, సాయంత్రం తిరిగి వెళ్తుంటే వాహనం నుంచి శబ్దం వచ్చిందన్నారు. ముందు జాగ్రత్తగా చాలా స్లోగా వాహనం నడపడంతో రోడ్డు మధ్యలోనే తన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ టైర్ ఊడిపోయిందని తెలిపారు. ఒకవేళ తాము సాధారణ వేగంతో వెళ్లి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంటే ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి.. తన వాహనం మార్చాలని, లేనిపక్షంలో తనకు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


పలుమార్లు రోడ్డు మధ్యలోనే ఆగిపోయిన రాజా సింగ్ వాహనం


గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి మధ్యలోనే ఆగిపోయింది. ఈ వాహనం 6 సార్లు నడిరోడ్డుపై నిచిలిపోగా.. తాజాగా అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఏకంగా టైర్ ఊడిపోయింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచుగా రోడ్డుపై ఆగిపోతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ చెబుతున్నారు. అవసరం లేని వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం సమకూరుస్తుందని.. అవసరం ఉన్న తనకు మాత్రం సరైన వాహనాన్ని అందించడం లేదని గత నెలలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేకపోవడంతో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు చెప్పానని వివరించారు. అయినా కూడా పోలీసులు వినడం లేదని.. ఇలాంటి వాహనాన్ని ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు.