YS Viveka Case : మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తాను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని  తప్పుగా నమోదు చేశారని తెలిపారు.   సీబీఐ చార్జిషీట్ లో పేర్కొన్నదేంటి అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ లేదని ... పత్రికల్లో చూసి తాను ఆ విషయం తెలుసుకున్నానని, అది కూడా పూర్తిగా వక్రీకరించారని దాన్ని తొలగించాలని కోరారు.  


తాన చెప్పింది..సీబీఐ రాసుకుంది వేర్వేరన్న అజేయకల్లాం !                        


ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా పేర్కొన్నదని ఆయన అంటున్నారు. అందుకే దాన్ని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఏప్రిల్‌ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్‌మెంట్‌‌ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్‌లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.  మార్చి 15, 2019న జగన్‌ నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్‌ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు. ఇంతకు మించి నేనేమీ సీబీఐకి చెప్పలేదని అజేయకల్లాం చెబుతున్నారు. 


కోర్టుకు సీబీఐ సమర్పిచిన  అజేయకల్లాం స్టేట్‌మెంట్‌లో ఏముందంటే ?                                               
 
వివేకా హత్య కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అయిన అజేయ కల్లాంను ఒక సాక్షిగా పేర్కొంది. ఆయన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసింది.   "హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉండగా, ఉదయం 5.30 గంటలకు జగన్ అటెండర్ తలుపు కొట్టారు. వైఎస్ భారతి మేడపైకి రమ్మంటున్నారని ఆ అటెండర్ జగన్‌కు చెప్పారు. బయటకి వెళ్లిన 10 నిమిషాల తర్వాత జగన్ మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇకలేరని జగన్ నిలబడే మాకు చెప్పారు అని వివరించారు. అని సీబీఐ స్టేట్ మెంట్‌ను కోర్టుకు సమర్పించింది. 


వివేకా కేసు సుప్రీంకోర్టులో  !                            


చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అజేయకల్లాం ఓ నెల పాటు చీఫ్ సెక్రటరీగా పని చేశారు. పొడిగింపు లభించకపోవడంతో రిటైరయ్యారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పని చేశారు. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కు  కూడా ఆయనను పిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ముఖ్య సలహాదారు పదవి ఇచ్చారు. ఇటీవలే ఆ పదవిని రెండో సారి పొడిగించారు.