Financial Aid: ఆర్థిక సాయం పథకం కింద.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు లక్ష రూపాయలు అందించాలని నిర్ణయించింది. ఏదైనా వ్యాపారం ఏర్పాటు చేసుకునేందుకు 100 శాతం రాయితీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనర్టీల ఆర్థిక సహాయ సంస్థ.. క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ ఐఏఎస్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందాలనుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సంవత్సరానికి రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సంవత్సరానికి రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలని, ఆయా క్రైస్తువులు మాత్రమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. అలాగే దరఖాస్తు దారుల వయస్సు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. www.tsobmms.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తులు ఆన్ లైన్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 31 వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులకు గడువును నిర్దేసించినట్లు స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం సంబంధిత జిల్లా మైనారిటీ అధికారిని లేదా ఎండీ, క్రిస్టియన్ కార్పొరేషన్ కార్యాలయంలో 040-23391067 నంబరు ఫోన్ చేసి సంప్రదించాలని క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ ఐఏఎస్ కాంతి వెస్లీ తెలిపారు.
బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు.
విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతుందన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తుందని సీఎం అన్నారు. భిన్న సంస్కృతులను, విభిన్న మత, ఆచార, సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. దివ్యాంగుల పింఛన్ ను రూ.1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ.4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మంత్రులు అంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రజలకు చెబుతున్నారు.