AP Agri Gold : ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సెప్టెంబర్ 6వ తేదీన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్రందన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు చెమటోడ్చి పొదుపు చేసుకున్న నగదుతో యాజమాన్యం వేలకోట్ల ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్నారని బాధితుల తరపున పోరాడుతున్న నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ సమస్య ఉందన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల విలువపై తలోమాట
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అగ్రిగోల్డ్ ఆస్తులు 36 వేల కోట్లు అని గతంలో ప్రకటించారని అగ్రిగోల్డ్ బాధితులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రూ.20వేల కోట్లు మాత్రమే ఉందని చెప్తున్నారన్నారు. యాజమాన్యం మాత్రం రూ.2200 కోట్లు అని చెబుతూ ఖాతాదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 20వేల కోట్ల నుండి 2200 కోట్లకు మధ్య మిగిలిన రూ. 18 వేల కోట్లు ఎవరిదో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 మార్చి 23వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకులు, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ.250 కోట్లు చెల్లిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 35 మాసాలు గడిచినా మాట తప్పి మడమతిప్పి అగ్రిగోల్డ్ ఖాతాదారులను నట్టేట ముంచారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హామీ ఇచ్చి జగన్ మోసం చేశారంటున్న బాధితులు
సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2019లో రూ.240 కోట్లు చెల్లించి రూ.20వేల లోపు డిపాజిట్ దారులకు 120 రోజులలో నగదు చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలకు రూ. లక్షా 67వేల కోట్లు చెల్లిస్తున్నామని ప్రకటించారని, రాష్ట్రంలోని 10 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకు రూ.3040 కోట్లు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సమస్యలతో పాటు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పట్ల కూడా స్పందించి పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీన వేలాది మందితో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ప్రకటించారు.
సెప్టెంబర్ ఆరో తేదీన ఆక్రందన ప్రదర్శన
సెప్టెంబర్ ఆరో తేదీన ఆక్రందన ప్రదర్శనను విజయవంతం చేయాలని అగ్రిగోల్డ్ బాధిత సంఘ నేతలు పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారాలతో పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. కేవలం 20 శాతం మంది సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయని మిగిలిన 80 శాతం సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో గద్దె దించడానికి అగ్రిగోల్డ్ బాధితుల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.3 వేల కోట్లు బటన్ నొక్కి విడుదల చేయడానికి ఎవరు అడ్డుపడుతున్నారని వారు ప్రశ్నించారు.