హైదరాబాద్ శివారు శంషాబాద్ పురపాలక మండలి పరిధిలోని కమ్యూనిటీ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ప్రార్థన మందిరాలను తొలగించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అక్రమంగా వెలసిన ప్రార్థన మందిరాలను 48 గంటల్లో తొలగించాలని రాజాసింగ్ స్థానిక రెవెన్యూ శాఖ అధికారులకు డెడ్ లైన్ విధించారు.


48 గంటల్లో తొలగించకపోతే..


శంషాబాద్ కమ్యూనిటీ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ప్రార్థన మందిరాల తొలగింపు 48 గంటల్లో పూర్తి కావాలని ఎమ్మెల్యే రాజా సింగ్ అధికారులను డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోవాల్సిందేనని లేకపోతే తానే స్వయంగా ప్రత్యక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు రాజా సింగ్. అక్రమ ప్రార్థన మందిరాల నిర్మాణాలపై రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. సెల్ఫీ వీడియోలో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. 


ఉన్నతాధికారులకు రాజాసింగ్ లేఖలు..


శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఏకే టౌన్ షిప్, గ్రీన్ ఎవెన్యూ వెంచర్లలోని కమ్యూనిటీ స్థలాల‌్లో ప్రార్థనా మందిరాలను అక్రమంగా నిర్మించడంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తోపాటు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు లేఖలు రాశారు ఎమ్మెల్యే రాజా సింగ్. అక్రమ నిర్మాణాలను తొలగించడంతోపాటు, వాటిని స్థలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేతోపాటు ఎంఐఎం పార్టీ నేతల ఒత్తిడికి స్థానిక రెవెన్యూ అధికారులు తలొగ్గుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. అందుకే అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా.. వారిని అధికారులు ఏమీ అనలేకపోతున్నారని రాజా సింగ్ విమర్శించారు. ఇతరులకు చెందిన స్థలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కలెక్టర్ అమోయ్‌ కుమార్ తో పాటు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేశారు. 


మునావర్‌ షోపై సంచలన కామెంట్స్


మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీషోను రద్దు చేయకపోతే ప్రదర్శన జరిగే హాల్‌ను తగలబెడతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. మునావర్ ఫారుఖీ షోకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఆగస్టు 20 శనివారం హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ స్టాండప్ కమెడియన్ షో జరగనుంది. షో కోసం ఇప్పటికే టికెట్ల బుకింగ్ అయిపోయింది. అయితే మునావర్ ఫారుఖీ గతంలో హిందూ దేవుళ్లను అవమానించేలా స్టాండప్ కామెడీ చేశారని ఆయన షోను అంగీకరించే ప్రశ్నే లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే  మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీకి బీజేవైఎం ఫిర్యాదు చేసింది. 


మునావర్ షో ఇచ్చే హాల్‌ను తగలబెడతామన్న రాజాసింగ్ 


మునావర్ ఫరూఖీ షో జరిగే హాల్ ను తగలబెడతామని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. మునావర్  హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు మునావర్ కు ఎవరూ సహకరించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరికలు జారీ చేశారు.  అయితే పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. మునావర్  షోకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నాకుయ  మునావర్ షోకు అనుమతి ఇవ్వడమే కాదు.. ఆ షోను అడ్డుకుంటామని హెచ్చరించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. మునావర్ షో ముగిసేవరకు రాజాసింగ్ బయటికి రాకుండా పోలీసులు అతని ఇంటిదగ్గర పోలీసులను మోహరించారు. ‌అతన్ని హౌస్‌ అరెస్టు చేశారు.