సీజేఐ ఎన్వీ రమణ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు ప్రభుత్వం తరపున ఊహించనంతగా గ్రాండ్ వెల్కం లభిస్తోంది. ఆయన గౌరవార్థం తేనీటి విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన స్వగ్రామంలో కార్యక్రమాలకు సీనియర్ మంత్రులు హాజరవుతున్నారు. సీజేఐని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మామూలుగా భారత చీఫ్ జస్టిస్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం అలా గౌరవించాలి కాబట్టి గౌరవిస్తున్నారని అనుకోవచ్చు. కానీ గతంలో జరిగిన పరిణామాల గురించి తెలిసిన వారు మాత్రం ఇది సాధారణం కాదు.. అసాధారణ అని అనుకుంటున్నారు. 


Also Read: ఏపీ ఆర్థిక పరిస్థితిపై "గ్రీన్‌ పేపర్" రిలీజ్ చేయాలన్న యమనల ! ఏమిటీ గ్రీన్ పేపర్ ? వైట్‌పేపర్‌కు దీనికి తేడా ఏంటి ?


జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్రమైన అభియోగాలతో లేఖలు రాసి మీడియాకు సైతం విడుదల చేయించిన ఏపీ ప్రభుత్వం !


ఓ ఏడాది వెనక్కి వెళ్తే  సీనియార్టీ ప్రకారం కాబోయే సీజేఐ ఎన్వీ రమణపై తీవ్రమైన అభియోగాలు చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పటి చీఫ్ జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు. అది న్యాయవ్యవస్థకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం. ఆ లేఖపై సీజేఐ బోబ్డే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆయన బయటపెడతారో లేదోనన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయకల్లాం తానే స్వయంగా ఆలేఖ బయట పెట్టారు. అందులో ఉన్న ఆరోపణలన్నింటినీ చదివి వినిపించారు. ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై తీవ్రమైన అభియోగాలు చేయడం..  వాటిల్లో నిజానిజాలేంటో ఎవరికీ తెలియకపోయినా మీడియా, సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి అలా బయట పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ లేఖలోని అంశాలపై సీజేఐ బోబ్డే ఇన్ హౌస్ విచారణ జరిపి .. తప్పుడు ఫిర్యాదుగా తేల్చారు. దీంతో సీజేఐగా ఎన్వీ రమణ నియామకానికి మార్గం సుగమం అయింది. 


Also Read: సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ 1266 స్పెషల్ బస్సులు... హైదరాబాద్ నుంచి 362 సర్వీసులు... ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు


రాజధాని భూముల కేసుల ఎఫ్ఐఆర్‌లలోనూ టార్గెట్ ! 


జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ ప్రభుత్వం అలా టార్గెట్ చేసింది మొదటి సారి కాదు అంతకు ముందు సారి మాజీ అడ్వేకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై  రాజధాని భూముల కేసులు పెట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పెట్టిన ఆ ఎఫ్‌ఐఆర్‌లో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేయడానికి ఈ కేసు పెట్టారని అప్పట్లో దమ్మాలపాటి హైకోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా చేయాల్సిన ప్రచారం చేశారు. ఇవన్నీ బయటకు కనిపించేవి. ఇక జస్టిస్ ఎన్వీ రమణ టార్గెట్‌గా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత ఎన్నో వ్యూహాలు అమలు చేశారన్న గుసగుసలు రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటాయి.  


Also Read: శ్రీవారి దర్శనానికి ఇకపై ఇవి తప్పనిసరి... వ్యాక్సినేషన్ లేదా నెగిటివ్ సర్టిఫికేట్ ఉంటేనే కొండ పైకి అనుమతి... రేపు సర్వ దర్శనం టికెట్లు విడుదల


సీజేఐ అయిన తర్వాత  కూడా దూరం పాటించిన సీఎం జగన్ ! 


సీజేఐకి ఎన్వీ రమణ ఎన్నికయిన తర్వాత తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. సాదాసీదాగా ఆయన పర్యటన ముగిసింది. అదే సమయంలో ఆయన తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్లిన సమయంలో అక్కడి ప్రభుత్వం భారీ కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో అప్పట్లోనే ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం చెప్పిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా పరిస్థితి ఏం మారినట్లుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ... ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ పెద్ద వైఖరిలో మార్పు కనిపిస్తున్న సూచనలు స్పష్టమవుతున్నాయి. 


Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్‌ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?


హఠాత్తుగా అత్యంత గౌరవ మర్యాదల ప్రదర్శన.. స్వాగతాలు..భేటీలు..! మనసు మార్చుకున్నారా ? 


సీజేఐ ఎన్వీ రమణ స్వగ్రామంలో పర్యటించేందుకు మూడు రోజుల కార్యక్రమాలు ఖరారు కాగానే ప్రభుత్వం అత్యంత ప్రయారిటీగా తీసుకుంది. ప్రభుత్వం అధికారికంగా ఎవరికైనా స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది దాదాపుగా ఉండదు. కానీ సీఎం జగన్ ఫోటో.. ప్రభుత్వం అధికారికంగా కొన్ని వందల ఫ్లెక్సీలను జస్టిస్ ఎన్వీ రమణ ప్రయాణించే మార్గాల్లో ఏర్పాటు చేసింది. ఎక్కడిక్కడ అత్యంత వినయవిధేయలతో మర్యాదలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సీజేఐకి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తరపున అధికారికంగా తేనీటి విందు ఏర్పాటు చేసి అందులో సన్మానిస్తారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో జరిగే విందు కార్యక్రమంలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. ఇంకా అనూహ్యంగా నోవాటెల్‌లో  ముందుగా షెడ్యూల్‌లో లేకపోయినా అడిగి మరీ సీఎం జగన్ సీజేఐ ఎన్వీ రమణతో భేటీ అయ్యారు. ఈ పరిణామాలన్నింటితో  సీజేఐ ఎన్వీ రమణ విషయంలో  సీఎంజగన్ వైఖరి మారిందనే అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. 


Also Read: మందు రెడీ .. రెండు రోజుల్లో ఒమిక్రాన్ తగ్గిస్తా..! నెల్లూరు ఆనందయ్య చాలెంజ్ !
 
నాడు వెంకయ్యనూ వర్గశత్రువుగా చూశారు.. ఇప్పుడు మనసు మార్చుకున్నారా ?


ఒక్క సీజేఐ ఎన్వీ రమణ విషయంలోనే కాదు.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విషయంలోనూ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, జగన్ వైఖరి చాలా కఠినంగా ఉంటుంది. ఆయన  పేరును అసెంబ్లీతో పాటు వివిధ సభా వేదికలపై ఏకవచనంతో సంబోధించి... విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం వివాదంలో  వెంకయ్యనాయుడుకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఆయన పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని కటువుగా ప్రశ్నించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిది. మాతృభాష గురించి పత్రికల్లో వెంకయ్యనాయుడు వ్యాసాలు రాయడమే సీఎం జగన్‌కు కోపం తెప్పించింది. ఇక  వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ... సభలో వెంకయ్యనాయుడును ఎన్ని సార్లు తూలనాడారో లెక్కేలేదు. ఓ సందర్భంలో వెంకయ్య తనువు బీజేపీ.. మనసు టీడీపీ అని కూడా అన్నారు. ఈ మాటలకు వెంకయ్య ఆవేదన చెందారు కూడా. అయితే ఇటీవలి కాలంలో వెంకయ్యనాయుడుతోనూ కటువుగా ఉడటం లేదు వైఎస్ఆర్‌సీపీ నేతలు. పలు అంశాల్లో క్షమాపణలు కూడా కోరుతున్నారు. దీంతో  వర్గశత్రువులుగా భావిస్తున్న వారి విషయంలో వైఎస్ఆర్‌సీపీ మనసు మార్చుకుందా..? లేక తప్పనిసరిగా మార్చుకున్నట్లు కనిపిస్తోందా ? అన్నది రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు. 


Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి