Actor Prudhvi Raj Slams Ycp Ministers: ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి (TDP And Janasena Alliance) విజయం సాధిస్తుందని.. 135 ఎమ్మెల్యే, 21 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల కలయిక అద్భుతమని.. మార్పునకు శుభ సూచకమని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరో వంద రోజుల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వనున్నట్లు చెప్పారు. తాను చంద్రబాబు, పవన్ వదిలిన బాణాన్ని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని.. టీడీపీ, జనసేన తరఫున ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు. కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం. దీని వల్ల వైసీపీకి ఏం జరుగుతుందో చూడాలి' అని పేర్కొన్నారు.
యాత్ర ద్వారా ప్రచారం
రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకూ యాత్ర ద్వారా ప్రచారం చేయనున్నట్లు పృథ్వీరాజ్ వెల్లడించారు. వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. రాబోయే ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పని చేస్తాయని పేర్కొన్నారు. దుర్భాషలాడే మంత్రులు అధికారం కోల్పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. ఎవరి జాతకం ఏంటి అనేది తన దగ్గర పూర్తి వివరాలున్నాయని అన్నారు. లోకేశ్ దగ్గర రెడ్ డైరీ ఉన్నట్లు తన దగ్గర కూడా పీఆర్ డైరీ ఉందని చెప్పారు. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వారు మంత్రులా.? అని ప్రశ్నించారు.
వైసీపీ ఇంఛార్జీల మార్పులపై
రాబోయే ఎన్నికల దృష్ట్యా వైసీపీ ఇంఛార్జీల మార్పులపైనా పృథ్వీరాజ్ స్పందించారు. 'వై నాట్ 175' అంటున్న వైసీపీ అధిష్టానానికి పలు చోట్ల మార్పులు ఎందుకని ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమా ఉన్న వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఓ చోట గెలిచిన వ్యక్తిని మరో చోట తీసుకెళ్లి నిలిపితే ఓటు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రస్తుతం ఒక్క రాజధానే లేదని.. ఇక 3 రాజధానులు ఎక్కడ వస్తాయంటూ ప్రశ్నించారు. ప్రచార యాత్రలో వైసీపీ నేతల బండారం బయట పెడతానని అన్నారు.