AP Roads : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు బాగోలేవని చాలా మందికి తెలుసు. బయట వాళ్లు ఎప్పుడైనా ఏపీకి వెళ్తే ఇవేం రోడ్లురా బాబూ అని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. కానీ అక్కడి ప్రజలకు మాత్రం అలవాటైపోతోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ప్రజలు అలవాటు పడలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు కొత్త తరహాలో ప్రయత్నిస్తున్నారు. అలా ఓ యువకుడు చేసిన ప్రయత్నం ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 





 గ్రామానికి వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతూ వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాజేష్ పొర్లు దండాలతో నిరసన చేపట్టారు. జగనన్న రోడ్డు వేయాలంటూ నినాదాలు చేస్తూ పొర్లు దండాలు పెట్టారు. 40ఏళ్ల కిందట గ్రామం ఏర్పడినా దారి అభివృద్ధికి నోచుకోకపోవడం.. వర్షం పడితే రాకపోకలకు కష్టంగా మారడంతో వార్డు సభ్యుడైన రాజేష్‌ యువకులతో కలిసి దారిలో పొర్లుతూ నిరసన తెలిపారు.


రాజేష్ ఓ ఓటర్ మాత్రమే కాదు. ప్రజాప్రతినిధి కూడా. సోమిరెడ్డిపల్లె  పంచాయతీకి చెందిన వార్డు సభ్యుడు. ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. తాను అలా నిరసన చేస్తే.. తనపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని తెలిసి కూడా సాహసించారు. ఊరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎలాగైనా రోడ్డుకు మరమ్మతులు చేయిస్తే చాలని అనుకున్నారు. అందుకే ఈ మార్గన్ని ఎంచుకుని.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసుకున్నారు. 


ఇలాంటి వీడియో దొరికితే విపక్ష పార్టీల సోషల్ మీడయా కార్యకర్తలు ఊరుకుంటారా? విస్తృతంగా ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలో.. సొంత పార్టీ నేత ఇరా చేశారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 





రోడ్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయితే ఇలా బయటపడేవాళ్లు చాలా తక్కువ. కానీ రేపు ఎన్నికలప్పు రోడ్ల పరిస్థితిని సీరయస్‌గా తీసుకుంటే మొత్తానికే మోసం వస్తుందని వైఎస్ఆర్‌సీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. వీలైనంత తొందరగా రోడ్లు బాగు చేయాలని కోరుతున్నారు.