Tiger Dead : పులిని చూడాలి కానీ కలవాలనుకోకు చంపేస్తుంది అనే సినిమా డైలాగుల్ని మనం చాలా విని ఉంటాం. కానీ వాళ్లు పులిని చూడటమే కాదు.. కోసుకుని తిన్నారు. అయితే చంపేసి తిన్నారా.. చచ్చిపోయింది కనిపిస్తే తిన్నారా అన్నది పక్కన పెడితే... పులిని మాంసంగా చేసుకుని పంచుకుని తినేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు ప్రాంతం అటవీ ప్రాంతం. పులులు కూడా తిరుగుతూ ఉంటాయి. అలా ఓ పులి విద్యుత్ కంచెకు తగిలి చనిపోయింది. దీన్ని గమనించిన కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కానీ అసలు అటవీ సిబ్బందికి తెలియనిదేమిటంటే అప్పటికే అది చనిపోయిందని వండుకుని తినేశారని. తర్వతా పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి చనిపోయింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తినేశారు. ఈ విషయం అటవీ అధికారులకు తెలియకుండా గుట్టుగా ఉన్నారు. కానీ ఈ పులి మాంసాన్ని పంచుకునే విషయంలో కొంత మందితో విబేధాలు రావడంతో బయటకు పొక్కింది. దీంతో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
పులి మాంసాన్ని పంచుకున్న వారిలో ఇద్దరిని గుర్తించి అటవీ అధికారులు పిలిపించి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తల్లి కోసం రెండు పులి కూనలు వెతుకుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో కరెంట్ కంచెకు తగిలి చనిపోయిన పులి.. ఈ కూనల తల్లేనని అటవీ అధికారులు భావిస్తున్నారు. మామూలుగా అయితే ఇలా కరెంట్ తీగలను పెట్టడానికి నిబంధనలు అంగీకరించవు. అయితే తమపై జంతువులు దాడి చేస్తున్నాయని.. పంటలను నాశనం చేస్తున్నాయన్న కారణంగా వీటిని అటవీ ప్రాంతంలోని గ్రామస్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి వల్ల వన్యప్రాణాలు మృత్యువాత పడుతున్నాయి.