ఒక బాటిల్‌లో నీరు వేసి రెండు రోజులు తర్వాత తాగాలంటేనే మనకు అదోలా ఉంటుంది. ఆ నీరు కూడా వాసన మారిపోతుంది. రుచి చెడిపోతుంది. ఆ నీటిని పారవేస్తాం తప్ప తాగలేం. కానీ ఒక శాస్త్రవేత్త ఏకంగా 260 సంవత్సరాల నాటి నీటిని తాగారు. నిజానికి ఆ నీటిని తాగడం చాలా ప్రమాదకరం. ఆ నీటిలో ఎలాంటి కలుషితాలు లేకుంటే సమస్య ఉండదు, కానీ కలుషితాల్లో కొన్ని ప్రమాదకరమైన సమ్మేళనాలు ఉంటే ప్రాణం పోయే అవకాశం ఉంది. కానీ ఒక శాస్త్రవేత్త తన పరిశోధనలో భాగంగా ఆ నీటిని తాగాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం తాగుతున్న నీటి రుచి, ఆనాటి నీటి రుచి మధ్య తేడాని తెలుసుకోవడం కోసం శాస్త్రవేత్తలు ఈ పని చేయాల్సి వచ్చింది.
2013లో కెనడాలోని ఒక గనిలో భూమి నుంచి దాదాపు ఒకటిన్నర మైళ్ళ లోతులో నీళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఆ నీళ్లు వేల ఏళ్ళ సంవత్సరాల పాటు అలాగే ఉన్నాయి. వాటిని ఎవరు తాకలేదు. ఆ నీరు గ్రానైట్ లాంటి రాళ్ల మధ్య సన్నని పగుళ్లలో ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఆ నీటి శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు సేకరించారు.
ల్యాబ్‌లో ఆ నీటి వయసును నిర్ణయించేందుకు పలు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో ఆ నీరు చాలా పురాతనమైనదని తేలింది. ఏకంగా 260 సంవత్సరాల నాటిదని నిర్ధారించారు. ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకురాలు బార్బరా షేర్వుడ్ లోలర్. ఆమె పరిశోధనలో భాగంగా ఈ నీటిని రుచి చూడాల్సి వచ్చింది.
నీటిని తాగిన ఆమె కాసేపు ఆ రుచిని అనుభవిస్తూ ఉండిపోయారు. తరువాత ఆ రుచి ఎలా ఉందో ఇతర శాస్త్రవేత్తలకు వెల్లడించారు. ఆ నీళ్లు కాస్త ఉప్పగా ఉన్నాయని, సంపులో ఉండే నీటి కంటే కాస్త జిగటగా ఉన్నాయని తెలిపారు. నీరు, ఆ రాళ్ల మధ్య ప్రతి చర్యల కారణంగానే నీరు ఉప్పుగా మారి ఉంటుందని ఊహించారు. అందుకే ఆ నీరు పసుపు రంగులోకి మారిందని భావిస్తున్నారు. ఎప్పుడైతే దాన్ని రాళ్ల మధ్యలోంచి తీసి ఆక్సిజన్ ఉన్న వాతావరణంలోకి తీసుకొచ్చారు. అది ఆక్సిజన్‌తో సంబంధంలోకి వచ్చి నారింజ రంగులోకి మారినట్టు ఆమె వెల్లడించారు. ఎప్పుడైతే ఈ నీరు ఆక్సిజన్‌తో కలుస్తుందో,అప్పుడు ఆ నీటిలో ఖనిజాలు ఏర్పడడం ప్రారంభిస్తాయి.
నీటి గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. నీరు ఈ భూమిపై మనిషి పుట్టుకకు ముందు నుంచే ఉందని తేల్చారు పరిశోధకులు. దాదాపు ధూళి మేఘాలు, వాయువులు ఏర్పడినప్పట్నించి నీరు ఉద్భవించడం ప్రారంభించిందని అధ్యయనాలు చెబుతున్నాయి. మనిషి పుట్టుకకు నీరే ఆధారమని కూడా పరిశోధకులు వాదిస్తూ వచ్చారు.
Also read: జంక్ ఫుడ్ అంటే ఇష్టమా? అయితే ఆ కాలేయ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.