Pegasus House Committe : పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు గత అసెంబ్లీ సమావేశాల్లో నియమించిన హౌస్ కమిటీ ఏపీ అసెంబ్లీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందని కమిటీ ప్రాథమికంగా నిర్ధారించిందని తెలిపారు. దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు. డేటా చౌర్యం ఆరోపణలపై మార్చి 23న శాసనసభ ఒక సభా సంఘాన్ని వేసిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
స్టేట్ డేటా సెంటర్‌లో ఉండాల్సింది టీడీపీ వ్యక్తులకు చేరిందన్న హౌస్ కమిటీ
గత ప్రభుత్వ హాయాంలో 2016 నుంచి 2019 మే 30 వరకూ టీడీపీ ప్రభుత్వం స్టేట్ డేటా సెంటర్ ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని పంపించారని తెలిపారు. తద్వారా వారు ప్రత్యేక లబ్ధి చేకూర్చుకున్నారని ఆరోపించారు. 2018, 2019 మధ్య కాలంలో వాళ్ల ప్రైవేటు సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, టీడీపీ వారు ఏర్పాటు చేసిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా దాదాపు 30 లక్షలకు పైగా తమ ప్రభుత్వానికి వేయని ఓటర్ల ఓటు హక్కును రద్దు చేసిందని కమిటీ పరిశీలనలో తెలిపిందన్నారు.
మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందన్న కమిటీ చైర్మన్
వివిధ శాఖల అధిపతులు, సంబంధిత అధికారులతో డేటా చౌర్యంపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశామని భూమన తెలిపారు. మొత్తం 85 పేజీలతో నివేదిక ఉంది. ఇది మధ్యంతర నివేదిక మాత్రమనని చెప్పడంతో హౌస్ కమిటీ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే హౌస్ కమిటీ నివేదికను ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆ తర్వాతే చర్చ ప్రారంభించాలన్నారు. అయితే నివేదిక ఇవ్వకపోవడంతో టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. వారి నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించారు.
చంద్రబాబు పెగాసస్ వాడారని మమతా బెనర్జీ అన్నట్లుగా వార్తలు రావడంతో హౌస్ కమిటీ
పెగాసస్ సాఫ్ట్ వేర్‌ను చంద్రబాబు ఉపోయగించారంటూ బెంగాల్‌లో మమతా బెనర్జీ వ్యాఖ్యానించారని ఓ సారి ప్రచారం జరగడంతో అసెంబ్లీలో దీనిపై చర్చించారు. సభా సంఘం వేయాలని నిర్ణయించి.. ఆ కమిటీ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. అయితే పెగాసస్ అంశాన్ని ఉపయోగించారా లేదా అన్నదాని కన్నా ఎక్కువగా ఈ కమిటీ డేటా చౌర్యంపై విచారణ జరిపినట్లుగా కనిపిస్తోంది.
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఉదయం నుంచి సంక్షోభంలో సంక్షేమం పేరుతో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. హౌస్ కమిటీ నివేదిక విషయంలోనూ వారు నివేదిక ఇవ్వాలని పట్టుబట్టారు. ఇవ్వకపోవడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.