AP Assembly Session 2022: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా ప్రతిపక్ష టీడీపీ నేతలు తమ నిరసనను కొనసాగించారు. సంక్షోభంలో సంక్షేమం నినాదంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం నిరసన చేపట్టారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జాబ్స్ ఎక్కడ జగన్ అంటూ ఇటీవల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సభలో నిలదీశారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. నేడు సంక్షేమ పథకాలు తొలగించడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.
వైసీపీ పాలనతో సంక్షేమ పథకాలు బంద్..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు చేశారని నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ఆరోపించారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత విధించారని.. ఇదేనా రాజన్న రాజ్యం అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సి, ఎస్టి, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ నేతలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.
వైసీపీ నేతలు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు !
వైసిపి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు. అధికార పార్టీ వైసిపి నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పేదల పథకాలు రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత రామా నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, అలాంటి పథకాలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి పై తాజాగా మొన్న అసెంబ్లీ సాక్షిగా... సీఎం జగన్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే... కేవలం అమరావతిని అంతం చేసేందుకే మూడు రాజధానుల మంత్రం పఠిస్తున్నారని... ప్రజలను మోసం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. లేకపోతే ఒక ప్రాంతం మీద ఇంత విషం చిమ్మడమా? చట్టసభలో ఇన్ని పచ్చి అబద్ధాలా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం 3 రాజధానులను చేసి తీరుతామని తాజా సమావేశాల్లోనూ స్పష్టత ఇచ్చింది.
రైతు ద్రోహి జగన్ అంటూ అసెంబ్లీ ముందు టీడీపీ శ్రేణులు సోమవారం సైతం నిరసన తెలిపాయి. నిరసన కోసం తీసుకొచ్చిన ఎడ్ల బళ్లని తరలించి, రైతుని అరెస్ట్ చెయ్యడం వైసిపి ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని లోకేష్ అన్నారు. మోటర్లకి మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరి తాళ్లు బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ధాన్యం బకాయిలు చెల్లించడం లేదంటూ మండిపడ్డారు. కనీసం విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.