పెంపుడు పిల్లిని హత్య చేశారంటూ ఓ కుటుంబ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసులు కేసు నమోదు చేయటంతోపాటు పిల్లి చనిపోవడానికి కారణాలు కనుక్కునేందుకు పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. 


గన్నవరం మండలం వి.ఎన్.పురం కాలనీలో మూడేళ్ళుగా ఓ పిల్లిని షేక్ చానా పెంచుకుంటున్నారు. అయితే తాను పెంచుకుంటున్న పిల్లి హఠాత్తుగా చనిపోయింది. ఉన్నట్టుండి పిల్లి చనిపోవటంతో చానా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చానా కుటుంబం కూడ శోకసంద్రంలో మునిగిపోయింది. పెంచుకుంటున్న పిల్లి హఠాత్తుగా చనిపోవటంతో అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీశారు. ఇంతలో వారికి చేదు నిజం తెలిసింది.


పక్కింటి వారే చంపేశారు...
చానా పెంచుకుంటున్న పెంపుడు పిల్లిని పక్కింటికి చెందిన వారు చంపేశారని స్థానికుల చెబితే తెలుసుకున్నారు చానా. ఈ విషయంపై పక్కింటిలో ఉంటున్న కుమారి అనే మహిళను నిలదీయగా తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తమ ఇంటి గోడ ఎక్కిందనే కోపంతోనే తాము పెంచుకుంటున్న పిల్లిని కుమారి కర్రతో కొట్టారని ఆరోపిస్తున్నారు చానా ఫ్యామిలీ. ఆమె కొట్టడం వల్లే తీవ్ర గాయాల పాలైన పెంపుడు పిల్లి మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. 


ఇంటిలో కుటుంబ సభ్యుడిగా పిల్లిని చూసుకున్నాం..
తమ ఇంటిలో కుటుంబ సభ్యుడిగా పిల్లిని చూసుకుంటూ పోషించామని, చానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెంపుడు పిల్లి మరణంతో ఆ కుటుంబంతోపాటుగా, కాలనీ వాసులకు కూడా ఆశ్చర్యం కలిగింది. చానా తాను పెంచుకుంటున్న పిల్లి గురించి కాలనీ వాసులందరికి తెలిసిన విషయమే. పలుమార్లు కాలనీవాసులు కూడ చానా పెంచుతున్న పిల్లిని చూసి సరదా పడే వారు. అయితే నిమిషాల వ్యవధిలో పిల్లి మరణించటంపై కాలనీ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.


పర్షియన్ రకం పిల్లి...
చనిపోయిన పిల్లి అరుదైన పర్షియన్ జాతికి చెందినగా చానా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పిల్లికి ఫీడ్ కూడా ఆన్ లైన్ లో మాత్రమే ఆర్డర్ ఇచ్చి తెప్పించాల్సి ఉంటుదని, ఇతరత్రా ఆహారం పెట్టినా తినదని చెబుతున్నారు. తమ కుటుంబంలో సభ్యుడిలా పిల్లిని చూసుకుంటామని చానా చెబుతున్నారు.


కేసు నమోదు చేసిన పోలీసులు....
పిల్లి మృతిపై చానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చానా ఫిర్యాదుతో గన్నవరం పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారి అనే మహిళను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు విషయం తెలిసుకునేందుకు పిల్లి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు వెటర్నరీ ఆసుపత్రి వైద్యులను ఆశ్రయించారు.