96 DSPs have been transferred in AP :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. ఇంతకు ముందు అన్ని జిల్లాల ఎస్పీల్ని మార్చిన ప్రభుత్వం తాజాగా డీఎస్పీలను పెద్ద ఎత్తున బ దిలీ చేసింది. ఏకంగా 96 మంది డీఎస్పీల్ని బదిలీ చేశారు. అందులో 57 మందికి పోస్టింగులు దక్కలేదు. వారిని  డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.


 










వైసీపీత సన్నిహితంగా వ్యవహరించే వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం                                                   


ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో డీఎస్పీలంతా వైసీపీకి అనుకూలంగా పని చేసే వారినే నియమించారని వారు టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ క్యాడర్ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మారినప్పటి నుండి డీఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి వరకూ బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. తమపై వేధింపులకు పాల్పడినవారికి పోస్టింగులు దక్కవద్దని పార్టీ నేతల ద్వారా పై స్థాయిలో ఒత్తిడి చేశారు. ఇటీవల .. పార్టీ నేతలపై రెండున్నర వేల కేసులు పెట్టారని టీడీపీ నేతలు తేల్చారు. ఆ కేసులు పెట్టిన వారు.. తప్పుడు కేసుల్లో ఇరికించిన డీఎస్పీలను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. 


గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన వారికి కీలక పోస్టింగులు                                


డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయమని ఆదేశించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. వీరంతా .. వివిధ పద్దతుల్లో పోస్టింగులు తెచ్చుకున్నారని.. గతంలో కొంత మంది సిన్సియర్ అధికారులకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వారందరికీ పోస్టింగులు దక్కినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం సామాజికవర్గాల వారీగా లెక్కలు తీసుకుని కొన్ని సామాజిక వర్గాలను.. ఏళ్ల తరబడి వేకెన్సి రిజర్వ్‌ లో ఉంచుతూ వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటి వారికి ఈ సారి ప్రాధాన్యం ఇచ్చినట్లగా చెబుతున్నారు. 


నిబంధనలు అతిక్రమించిన కొంత మంది డీఎస్పీలపై చర్యలు తీసుకునే చాన్స్                      


వైసీపీకి సేవలు చేసే క్రమంలో టీడీపీ నేతల్ని వేధించేందుకు కొంత మంది డీఎస్పీలు గీత దాటి మరీ వ్యవహరించారని వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. తాడిపత్రిలో డీఎస్పీగా పని చేసిన చైతన్య పై ఇరవై ఒక్క  ప్రైవేటు కేసులు ఉన్నాయి. ఆయనపై అనేక మంది ఫిర్యాదులు చేశారు. అలాంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని  చెబుతున్నారు. ఇప్పుడు డీఎస్పీలను బదిలీ  చేయగా.. తర్వాత సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి.