ఏపీలో రోజురోజుకూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఇవాళ కూడా నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 39,816 మందికి కరోనా పరీక్షలు చేయగా... కొత్తగా 4,528 మందికి వైరస్ సోకినట్టు తేలింది. వైరస్ కారణంగా ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. వైరస్ నుంచి మరో 418 కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 18,813 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, ఒమిక్రాన్ మరింతగా పెరుగుతోంది. వారం రోజుల కిందటి వరకు 50 వేలకు దిగువన వచ్చే కేసులు నేడు 2 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,64,202 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 315 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. దేశంలో మొత్తం కరోనా మరణాలు 4,85,350కు చేరుకున్నాయి.
క్రితం రోజుతో పోల్చితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 6.7 శాతం అధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో 1,09,345 మంది కరోనా బారి నుంచి కోలుకున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073 (12.72 లక్షలు)కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరగడం థర్డ్ వేవ్ ముప్పును సూచిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 5,753 నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కరోనా మరణాలు: 4,85,350
రోజువారీ పాజిటివిటీ రేటు: 14.78%
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 12,72,073
155 కోట్ల డోసుల టీకాలు..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. దీంతో భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 155.39 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 15.17 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయి. అనుమతి లభించడంతో 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేస్తున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 95.20 శాతానికి పడిపోయింది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూల వైపు మొగ్గు చూపుతున్నాయి. సాధ్యమైతే వీకెండ్ లాక్ డౌన్ లాంటి కోవిడ్ ఆంక్షలతో కరోనా వ్యాప్తిని నియంత్రించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
Also Read: Chiranjeevi : రాజకీయాల్లో లేను , రాజ్యసభ ఆఫర్ అవాస్తవం ... క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
Also Read: Guntur: చంద్రయ్య హత్య కేసులో 8 మంది అరెస్టు.. దాడికి అసలు కారణం ఇదే.. ఎస్పీ ప్రకటన