కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. రైతులపై ముప్పేట దాడి చేస్తోందన్నారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. రైతుల పట్ల  కేంద్ర ప్రభుత్వo వైఖరిని నిలదీశారాయన. ఆయన ఇంకా ఏమన్నారంటే..."ఎద్దు ఏడ్చిన ఎవుసం-రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ బాగు పడవని సీఎం కేసీఆర్ తరచూ ప్రస్తావిస్తారు. ఆయనకు వ్యవసాయమన్న, రైతులన్న అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో భాగంగానే ఎన్నో వేల గంటల మేధో మథనంలోంచి పుట్టినవే రైతు బంధు, రైతు భీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ నూతన సంస్కరణలతో రాష్ట్ర వ్యవసాయ రూపమే పూర్తిగా మారిపోయింది. కరవుతో అల్లాడిన నేల నేడు పచ్చని పైరులతో, ధాన్యపు రాశులతో కళకళలాడుతోంది. దేశానికే అన్నపూర్ణగా ఆనతి కాలంలోనే అవతరించింది. తెలంగాణ రైతులు దేశానికే దిక్సూచిగా మలచాలన్న ముఖ్యమంత్రి ఆశయం, పట్టుదల కళ్ల ముందే కనిపిస్తోంది.


రైతులను ఆదుకోవడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతును అరిగోస పెడుతున్నది. తమ కార్పొరేట్ మిత్ర శక్తుల ప్రయోజనం కోసం దేశ వ్యవసాయాన్ని, అన్నదాత బతుకును తాకట్టు పెడుతున్నది. రైతులను కూలీలుగా మార్చే కుట్రలకు తెరతీసింది. భవిష్యత్‌లో వ్యవసాయం కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్లి, వారు చెప్పిన ధరకు, వారు చెప్పిన రీతిలో ప్రమాదకరమైన వ్యవసాయం చేయాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి బిజెపి అనుసరిస్తున్న విధానాలే నిదర్శనం. పంట మద్దతు ధరపై స్పష్టతనివ్వరు. వ్యవసాయ పనిముట్ల రేట్లు పెంచి ట్యాక్స్‌లు వేస్తారు. పండగ పూట ఎరువుల ధరలు 3 నెలల కాలంలోనే 50% నుంచి 100% వరకు పెంచి రైతుల కళ్లల్లో ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు. ప్రశ్నించిన రైతులను తొక్కి చంపుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతును పూర్తి అగాధంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ సూచనల తుంగలో తొక్కారు.


కేంద్ర ప్రభుత్వ విధానాలపై  దేశ రైతాంగంతోపాటు తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. రైతులు ఎక్కడికక్కడ బిజెపిని నిలదీయాలి. స్థానిక బీజేపీ నాయకులను ప్రశ్నించాలి. వీరు కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న రైతు వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి గందరగోళ పరుస్తున్నారు. స్వరాష్ట్ర రైతుల ప్రయోజనాలు తమ స్వార్ధ రాజకీయాల కోసం కేంద్రం వద్ద తాకట్టుపెట్టిన వీరు రాష్ట్రానికి ప్రథమ ద్రోహులు. తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనేందుకు వీరికి మనసొప్పదు. తెలంగాణ రైతుల పట్ల బిజెపి నిర్లక్ష్యపు వైఖరి ఢిల్లీ వేదికగా స్వయంగా చూశాను. తెలంగాణ పంట కొనుగోలు చేయాలని మంత్రుల బృందం ఢిల్లీలో పడిగాపులు కాసింది. కానీ వారు రాష్ట్రంలోని వ్యవసాయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని అర్ధమైంది. రాజకీయం మాతో చేయండి రైతులతో కాదు అని కేసీఆర్ హెచ్చరించారు.


రైతుల పంట చేతికి వచ్చి సంతోషంగా ఉండే పండుగ పూట ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుని రైతులపై అక్కసును వెళ్లగక్కింది కేంద్రం. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేయాలి. రైతుల ప్రయోజనం కోసం కేంద్రంలోని బిజెపి చేసింది శూన్యం. దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయ స్థాయిలో బీజేపీపై మరో రైతు ఉద్యమానికి నాంది పడాలి." అని లేఖను విడుదల చేశారు ప్రశాంత్ రెడ్డి.