గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య (42) బహిరంగంగా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టుగా గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు. హత్య జరిగిన ఒక రోజులోపే నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని తాము అరెస్టు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం వెల్దుర్తి ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య అనే వ్యక్తి ఉన్నారని, ఈయనకు హతుడు చంద్రయ్యకు మధ్య పాత గొడవలు ఉన్నాయని వెల్లడించారు. ఓ సిమెంట్ రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య గతంలో గొడవలు జరిగాయని వివరించారు.


చంద్రయ్య బైక్‌పై వెళ్తుండగా ఆపి నిందితులు కత్తులతో దాడి చేసినట్టుగా చెప్పారు. ఉదయం 7 నుంచి 7.30 గంటల మధ్యలో ఈ హత్య జరిగిందని విశాల్ గున్నీ అన్నారు. చంద్రయ్య కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టుగా చెప్పారు. నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టామని తెలిపారు.


Also Read: ఎలాంటి విచారణకైనా సిద్ధం.. జగన్‌కు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ లేఖ.. నెల్లూరు వైసీపీ నేతలు వెల్లడి


నిందితుల కోసం నాలుగు బృందాలతో గాలింపు
‘‘నిందితులను పట్టుకోవడానికి మొత్తంగా 4 బృందాలను ఏర్పాటు చేశాం. 4 బృందాల్లో కలిపి ఆరుగురు ఎస్ఐలు ఉన్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నాం. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేశాం. వారిలో ప్రధాన నిందితుడు చింత శివరామయ్యతో పాటు చింత ఎలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింత శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింత ఆదినారాయణను అరెస్టు చేశాం.’’ అని ఎస్పీ వివరించారు.


అంతా ఒకే గ్రామ నివాసులు
‘‘ఈ 8 మంది నిందితులు ఒకే గ్రామంలో నివసిస్తుంటారు. ఒకే సామాజిక వర్గం కూడా. హత్య జరగడానికి ముందు నిందితుడు శివరామయ్య ఒక శుభకార్యానికి వెళ్లగా.. అక్కడ.. తోట చంద్రయ్య తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని ఇతరుల ద్వారా తెలుసుకున్నాడు. దీదంతో చంద్రయ్య దాడి చేసే ముందే అతనిపైనే దాడి చేయాలని శివరామయ్య నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరో ఏడుగురి సాయం తీసుకొని.. దారిలో వస్తుండగా బైక్‌ను ఆపి చంద్రయ్యను కత్తులతో పొడిచి చంపేశారు. అన్ని ఆధారాలతో ఈ 8 మందిని అరెస్టు చేశాం.’’ అని ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.


పాడె మోసిన చంద్రబాబు
చంద్రయ్య హత్య ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీమూకలే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయంటూ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ నేతలపై దాడులు, కేసులు పెరిగిపోయాయని అన్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం వెల్దుర్తి మండలం గుండ్లపాడు వెళ్లి... చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. చంద్రయ్య అంతిమయాత్రలో చంద్రబాబు పాడె కూడా మోశారు.


Also Read: Chiru Rajya Sabha : చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ ఇచ్చారా ? నిజమా ? మైండ్ గేమా ?


Also Read: పది రోజుల్లో సమస్యకు పరిష్కారం - చిరంజీవికి సీఎం జగన్ హామీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి