Janasena News: 2024... జనసేన చరిత్రలో మరుపురాని ఏడాది. పార్టీ పెట్టి 10ఏళ్ళు అయింది. ఇంతవరకూ అధ్యక్షుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 2019లో జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ వదిలి పోయారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. ఇది అసలు పార్టీయే కాదంటూ రాజకీయ ప్రత్యర్థుల నుంచి సెటైర్లు. అభిమానుల్లో అసహనం. అన్నిటికీ తిరుగులేని జవాబు ఇచ్చిన సంవత్సరం 2024. పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దానితో జాతీయ రాజకీయాల్లోనే మరెవరు కొట్టలేని రికార్డును జనసేన ఈ ఏడాది సాధించింది అవమానాలే... విజయానికి మెట్లుగా మారిన వైనం.
బహుశా గత ఐదేళ్లు అధికార వైసీపీ నేతలు..జగన్ అభిమానులు.. సోషల్ మీడియా సైన్యం చేతిలో అత్యంత దుర్భాషలు ఎదుర్కొన్న అత్యంత తిట్లు, ట్రోల్స్, అవహేళన ఎదుర్కొన్న వాళ్లలో చంద్రబాబు తర్వాత పవన్ కల్యాణ్ మాత్రమే. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఆపార్టీకి దూరం జరిగేలా పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. సోషల్ మీడియాలో పవన్ పవన్ కల్యాణ్‌కు అండగా అంతవరకూ ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల టైం వచ్చే సరికి ప్లేట్ ఫిరాయిం చేసిన వైనం జనసేన వర్గాలను సైతం షాక్ అయ్యేలా చేసింది. పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఒక్క రాత్రి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏపి రాజకీయాల్ని మార్చివేసింది.
చంద్రబాబు అరెస్ట్.. పవన్ కీలక నిర్ణయం
స్కిల్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు ఉందంటూ నాటి జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం దానితో పవన్ కల్యాణ్ హైదరాబాదు నుంచి హుటాహుటిన ఏపీకి బయలుదేరారు. ఈ రెండు ఘటనలు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పాయి. పవన్ కల్యాణ్ వస్తుంటే తెలంగాణ బోర్డర్ దగ్గర ఆపేశారు పోలీసులు. పవన్ కల్యాణ్ అక్కడే రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేయడంతో మంగళగిరి వెళ్లడానికి అనుమతించారు.
అక్కడి నుంచి యాక్టివ్ పార్ట్ తీసుకొని పవన్ రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలవడం బయటికి వచ్చి పొత్తు ప్రకటించడం దానికి బీజేపీ ఆదినాయకత్వాన్ని ఒప్పించడం చకచకా జరగిపోయాయి. కనీసం 40 సీట్లన్నా అడిగాలి అంటూ డిమాండ్ చేసిన కేడర్‌ను సముదాయించి 21 సీట్లకే పోటీ చెయ్యాలని పవన్ కల్యాణ్ నిర్ణయం సూపర్ సక్సెస్ అయ్యింది. ఎంపీలుగా కూడా రెండు చోట్ల పోటీ చేస్తే అక్కడా జనసేన విక్టరీ కొట్టింది. కూటమి ఏర్పడడానికి జగన్ ప్రభుత్వం కూలడానికి ఎంతవరకు తగ్గాలో అంతవరకూ తగ్గారు పవన్ కల్యాణ్. దాని ప్రభావం ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనపడింది. దాన్ని అర్థం చేసుకున్నారు గనుకే ప్రధాని మోదీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఎంతో గౌరవం ఇస్తున్నారు.
ఈ విజయం మరొకరి వల్ల కాదు
ఇంతకు ముందు ఎన్నికల్లో 100% గెలుపు సాధించిన చిన్నా చితక పార్టీలు ఉన్నాయి. అయితే అవి పోటీ చేసిన ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే. కానీ ఇలా 21 అసెంబ్లీ సీట్లకు రెండు ఎంపీ సీట్లకు పోటీ చేసి 100శాతం గెలుపు సాధించిన పార్టీ భారతదేశ చరిత్రలో మరొకటి లేదు. ఈ గెలుపుని ఆసరాగా తీసుకొని జనసేనను మరింత విస్తరించే పనిలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉన్నారు. దాని గుర్తించి జనసేనలో చేరడానికి ఒకప్పుడు పవన్ కల్యాణ్‌ను విమర్శించిన పెద్దపెద్ద నాయకులే క్యూ కడుతున్నారు. ఇలా ఎలా చూసినా 2024 జనసేన చరిత్రలో మరపురాని ఏడాదిగా నిలిచిపోయింది అనడం లో అనుమానం లేదు.